లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా రావని, ఆ పార్టీకి పరాభావం తప్పదని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సిఎం రేవంత్ రెడ్డికి బిజెపితో ఎలాంటి అపాయం లేదని, ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచే ముప్పు ఉందని హెచ్చరించారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఇతర పార్టీల నుంచి పలువురు బిజెపిలో చేరారు. ఈ సందర్బంగా వారందరికీ పార్టీ కండువా కప్పి కిషన్ రెడ్డి ఆహ్వానించారు.
తనపై కుట్ర జరుగుతోందని, తనను కింద పడేయాలని బిజెపి వాళ్ళు చూస్తున్నారని సీఎం రేవం త్ రెడ్డి కొండగల్ లో చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తాము ఎలాంటి డిస్ట్రబ్ చేయమని ఆయన స్పష్టం చేశారు. ఐదేళ్ల తర్వాత తెలంగాణలో బిజెపి ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో భారీ మెజార్టీతో మోదీ ప్రభుత్వం మరోసారి ఏర్పడబోతోందని భరోసా వ్యక్తం చేశారు. మూడోసారి మోదీ భారత్ ప్రధాని అయితే దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా మార్పులు జరుగుతాయని తెలిపారు.
తెలంగాణలో ఏమీ మార్పు రాలేదని , బిఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిందని అంటూ దొంగలుపోయి గజదొంగలు వచ్చినట్లుగా ఈరోజు తెలంగాణలో బిఆర్ఎస్ పోయి రేవంత్ రెడ్డి పాలన వచ్చిందని ఆయన విమర్శించారు. ఇప్పుడు బిల్డర్లు అందరూ ఢిల్లీకి వెళ్ళి ఆర్ ట్యాక్స్ కడుతున్నారని ఆయన ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు వరకు అందరూ ఆర్ ట్యాక్స్ బాధితులేనని చెప్పారు.
అందరూ ఢిల్లీ వెళ్ళి కోట్లాది రూపాయలు ఆర్ ట్యాక్స్ గా చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. పాలకులు మారినప్పటికీ పాలనలోనూ, దోపిడీలోనూ మార్పు రాలేదని ధ్వజమెత్తారు. గతంలో పలుమార్లు కాంగ్రెస్, బిఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయని గుర్తు చేశారు. ఆ రెండు పార్టీల డిఎన్ఎ ఒకటేనని అంటూ ఈరోజు తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ వాటిని నెరవేర్చడం లేదని ఆయన ఆరోపించారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ దానిని మర్చిపోయారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలే అమలు చేయలేదంటే, తాజాగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ మాత్రం కొత్త హామీలను ఇచ్చారని ఆయన ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మారదని, కుటుంబ పాలన, అవినీతి పాలన దేశంలో ఎప్పటికీ మారదని స్పష్టం చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి 2019లో 40 సీట్లు మాత్రమే ఇచ్చారని చెబుతూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వద్ద అభివృద్ధిపై అజెండా లేదన్నారు. హామీలు ఎలా నెరవేరుస్తారో తెలియదని చెప్పారు.