బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిని కించపరచేలా వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలాకు ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు పంపింది. ఈనెల 11వ తేదీ సాయంత్ర 5 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించింది.
అన్ని పార్టీల నేతలు పబ్లిక్‌లో మాట్లాడేటప్పుడు మహిళల గౌరవాన్ని కించపరచరాదంటూ ఈసీ ఇచ్చిన సూచనల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కూడా ఈసీ కోరింది. 12వ తేదీ సాయంత్రంలోగా సమాధానం ఇవ్వాలని అడిగింది. ఉత్తరప్రదేశ్‌లోని మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న హేమమాలిని 2024 లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి మధుర నుంచే పోటీలో ఉన్నారు.
సూర్జేవాలా చేశారన్న వ్యాఖ్యలపై హేమా మాలిని స్పందించారు. ‘‘పేరు ప్రఖ్యాతులున్న వారిని కాంగ్రెస్ లక్ష్యం చేసుకుంటోంది. పేరుప్రఖ్యాతులున్న వారిని తక్కువ చేయడం వల్ల వారికేమి మేలు జరుగదు. వారు మహిళలను ఎలా గౌరవించాలో ప్రధాని మోడీ నుంచి నేర్చుకోవాలి’’ అని మథురా ఎంపీ అయిన హేమా మాలిని హితవు చెప్పారు.
సూర్జేవాలి అన్న వీడియో సంగ్రహాన్ని ఎన్నికల సంఘం షేర్ చేస్తూ ‘‘ ఆయన వ్యాఖ్యలు అమర్యాదగా, అసభ్యంగా ఉన్నాయి. అవి శ్రీమతి హేమా మాలినిని అవమానించే విధంగానే కాదు, ఆమె పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా కించ పరిచే విధంగా ఉన్నాయి. అంతేకాక ఓ పార్లమెంటు సభ్యురాలి గౌరవాన్ని, హుందాతనాన్ని, ప్రజా జీవితంలో ఉన్న మహిళను, మహిళలను అగౌరవపరిచేదిగా ఉంది’’ అని పేర్కొంది.