పంతజలి సహ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్, ఆ సంస్థ సిఇఒ బాలకృష్ణ క్షమాపణలను సుప్రీంకోర్టు బుధవారం మరోసారి తిరస్కరించింది. వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ .. చర్యలకు సిద్ధం కావాలని ఆదేశించింది. ‘క్యూర్ ఫర్ కొవిడ్’ ప్రకటనలపై చర్యలు తీసుకోని ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది.
రామ్‌దేవ్ ఉద్దేశపూర్వకంగా, బుద్ధిపూర్వకంగానే కోర్టు హామీని ఉల్లంఘించినట్లు జస్టిస్ హిమా కొహ్లీ, జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లాలతో కూడిన ద్వి సభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. మేము అంధులం కాదు. ఈ సమయంలో కూడా ఉదారంగా వ్యవహరించలేము ” అని వ్యాఖ్యానించారు.
క్షమాపణ కాగితంపై మాత్రమే ఉందని, కానీ వారి యథావిథిగా వ్యవహరిస్తున్నారని మండిపడింది. కోర్టు చర్యల నుండి తప్పించుకునేందుకు కేవలం ఆత్మరక్షణ కోసమే క్షమాపణలు చెప్పారని మండిపడింది. రామ్‌దేవ్ రెండు సార్లు ఒప్పందాన్ని ఉల్లంఘించారని జస్టిస్ అమానుల్లా మండిపడ్డారు.
క్షమాపణలను ముందుగా మీడియాకు పంపారని ధర్మాసనం పేర్కొంది. మంగళవారం సాయంత్రం 7.30 గంటల వరకు కోర్టులో అప్లోడ్ అవ్వలేదని, దీంతో వారు పబ్లిసిటీ కోరుకుంటున్నారని అర్థమౌతోందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు కోర్టు పట్ల అలక్ష్యంగా వ్యవహరించినట్లే మీ క్షమాపణల పట్ల మేం ఎందుకు వ్యవహరించకూడదని ధర్మాసనం ప్రశ్నించింది.
మీ క్షమాపణల పట్ల విశ్వాసం లేదని, వాటిని తిరస్కరిస్తున్నామని పేర్కొంది. తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీని ప్రశ్నించింది. లైసెన్సింగ్ అథారిటీలోని ముగ్గురు అధికారలను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించింది.
గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు హామీని ఉల్లంఘిస్తూ వైద్య ఉత్పతులను ప్రచారం చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నేడు విచారణకు హాజరుకావలంటూ రామ్‌దేవ్, బాలకృషణలకు ఈ ఏడాది ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది.