ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గురువారం రోజున సీబీఐ అధికారులు అరెస్ట్ చేయగా, శుక్రవారం ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి విచారించేందుకు కవితను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోరగా, వాదనలు విన్న న్యాయస్థానం మూడు రోజుల కస్టడీకి అనుమతించింది.
దీంత ఈనెల 15వ తేదీ వరకు కవితను సీబీఐ అధికారులు విచారించనున్నారు. ఇప్పటివరకు తీహార్ జైలులో ఉన్న కవితను అధికారులు సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించనున్నారు. కవితను మూడు రోజుల పాటు ఇక్కడే విచారించనున్నారు. మరోవైపు కస్టడీ సమయంలో ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను, తన తరుఫు లాయర్లను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతినిచ్చింది.
ఈ క్రమంలో కవిత కస్టడీపై కోర్టులో ఇరువైపుల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. కవిత అరెస్ట్ అక్రమంటూ ఆమె తరుఫు లాయర్లు వాదించగా, లిక్కర్ స్కాం కేసులో కవితనే ప్రధాన సూత్రధారి అని సీబీఐ అధికారులు ఆరోపించాంపు. ఇరు వర్గాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి భవేజా సీబీఐ వాదనలతో ఏకీభవించారు. ఈ మేరకు కవితను మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్వర్వులు ఇచ్చారు.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత రెండు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ రెండు పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వాటిని తోసిపుచ్చింది. సీబీఐ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ లో కీలక విషయాలను ప్రస్తావించింది. లిక్కర్ కేసులో కవితను ప్రధాన కుట్రదారు అని పేర్కొంది. సౌత్ గ్రూపునకు చెందిన ఓ మద్యం వ్యాపారి 2021లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కలిశారని తెలిపింది.
తమకు అనుకూలంగా పాలసీని రూపొందించాలని కోరారని.. అందుకు ఆప్ పార్టీ నిధులను కోరిందని వివరించింది. ఇదంతా కూడా కవిత డైరెక్షన్ లోనే నడించిందని కస్టడీ పిటిషన్ లో సీబీఐ వెల్లడించింది. ఆప్ కు రూ. 100 కోట్ల చెల్లించాల్సి ఉంటుందని, ముందుగా రూ. 50 కోట్లు ఏర్పాటు చేయాలని సదరు వ్యాపారవేత్తను కవిత కోరినట్లు సీబీఐ వివరించింది.
రూ. 50 కోట్లలో సగం మొత్తాన్ని వ్యాపారవేత్త చెల్లించారని సీబీఐ తెలిపింది. అందుకు ఫలితంగా వ్యాపారవేత్త కుమారుడికి ఇండో స్పిరిట్ కంపెనీలో భాగస్వామ్యం ఇచ్చారని పేర్కొంది. ఈ ఇండో స్పిరిట్ కంపెనీ ని కేవలం తిరిగి చెల్లింపులు చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన కిక్‌బ్యాక్ గా సీబీఐ అభివర్ణించింది. అప్రూవర్ గా మారిన దినేశ్ అరోరా తన వాంగ్మూలంలో చెప్పిన విషయాలను కూడా సీబీఐ జతపర్చింది.
సౌత్ గ్రూపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ మాగుంట, శరత్ రెడ్డి (అరబిందో గ్రూప్ ప్రమోటర్), కవిత, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సమీర్ మహేంద్రుడు ఉన్నారని సీబీఐ తెలిపింది. కేజ్రీవాల్‌కు సన్నిహితుడైన నాయర్‌తో పాటు మద్యం వ్యాపారంలో ఉన్న వ్యక్తులతో జరిగిన సమావేశాల్లో బోయిన్పల్లి, అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు గోరంట్ల ప్రాతినిధ్యం వహించారని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో కవితకు సంబంధాలు ఉన్నాయని ఆ హామీతోనే శరత్ చంద్రారెడ్డి లిక్కర్ బిజినెస్ లోకి వచ్చారని సీబీఐ వివరించింది. లిక్కర్ పాలసీలో హోల్‌సేల్ వ్యాపారానికి రూ. 25 కోట్లు మరియు ప్రతి రిటైల్ జోన్కురూ. 5 కోట్లను ఆప్ కు చెల్లించాలని శరత్ చంద్రారెడ్డికి కవిత చెప్పారని సీబీఐ తన పిటిషన్ లో ప్రస్తావించింది. ఇందుకు శరత్ చంద్రారెడ్డి విముఖత చూపడంతో ఆతడిని కవిత బెదిరించారని, తెలంగాణ, ఢిల్లీలో ఎలా వ్యాపారం చేస్తావో చూస్తానని బెదిరించారని సీబీఐ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ లో ప్రస్తావించింది..