”మోదీస్ గ్యారెంటీ: డవలప్డ్ ఇండియా 2047” అనే థీమ్‌తో లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ సిద్ధం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా బీజేపీ మేనిఫెస్టో ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం విడుదల కానుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు.
బీజేపీ మేనిఫెస్టో ప్రధానంగా అభివృద్ధిపై దృష్టి సారించనుంది. అభివృద్ధి భారతం లక్ష్యంగా మహిళలు, యువత, పేదలు, రైతుల అభ్యున్నతికి మేనిఫెస్టో భరోసా ఇవ్వనుంది. సాధించగలిగిన హామీలను మాత్రమే ఇవ్వడం, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం మేనిఫెస్టో ప్రధాన ఉద్దేశంగా చెప్పనుంది. కల్చరల్ నేషనలిజంపై దృష్టిసారిస్తూ 2047 నాటికి అభివృద్ధి భారతం సాధిస్తామనేది మోదీ ప్రధాన గ్యారెంటీగా ఉండనుంది.
”సబ్ కా సాథ్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్” అనే మంత్రంతో సంకల్ప్ పాత్ర (బీజేపీ మేనిఫెస్టో) ఉంటుంది. 400 సీట్లకు పైమాటే.. అనే పిలుపుతో బీజేపీ ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలోని మేనిఫెస్టో కమిటీ ఇప్పటికీ రెండు సార్లు సమావేశమైంది. మేనిఫెస్టో కోసం 15 లక్షల సూచనలు బీజేపీకి వచ్చాయి. వాటిలో 4 లక్షల సూచనలు నమో యాప్ ద్వారా, 11 లక్షల సలహాలు వీడియోల రూపంలో వచ్చాయి.
27 మందితో కూడిన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కో-ఆర్డినేటర్‌గా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కో-కోఆర్డినేటర్‌గా ఉన్నారు. 543 మంది సభ్యులున్న 18వ లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19తో మొదలు ఏడు విడతలుగా జరుగనున్నాయి. వీడితో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. అదనంగా 16 రాష్ట్రాల్లో 35 సీట్లకు ఉప ఎన్నికలు కూడా జరుగనున్నాయి.