ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 23 శాతం ఫిట్‌మెంట్‌ను వ్యతిరేకిస్తున్నారు. అలాగే, హెచ్ఆర్ తగ్గింపు, సీసీఏ రద్దు, 70-75 సంవత్సరాల పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్‌కు సంబంధించి విడుదల చేసిన జీవోలపై ఉద్యోగ, ఉపాధ్యాయులు రగిలి పోతున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన, ఆందోళనలు చేపట్టారు. పీఆర్సీపై ఏకపక్ష జీవోలు జారీ చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఏపీ ఉద్యోగ సంఘాలు సమరానికి సిద్ధమయ్యాయి. సమ్మె అస్త్రాన్ని ప్రయోగించనున్నట్లు తెలిపాయి. అంతేకాదు.. కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు ఇచ్చాయి. శుక్రవారం సమ్మె నోటీసు ఇచ్చేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సిద్ధమయ్యారు.
అన్ని సంఘాలు, ఇరు జేఏసీల ఐక్య కార్యాచరణ వేదిక చర్చించుకుని నిర్ణయం తీసుకోనున్నాయి. పీఆర్సీ కోసం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు గతంలో ఎన్నాడూ సమ్మె చేయలేదు. ఇప్పుడు సమ్మె వరకు వెళితే తొలి పీఆర్సీ సాధన సమ్మె అవుతుంది.
కాగా పీఆర్సీపై గురువారం అమరావతి జేఏసీ ఎన్జీఓ జేఏసీ ఆధ్వర్యంలో వేరువేరుగా సమావేశాలు నిర్వహించనున్నాయి. పీఆర్సీపై ఏ విధంగా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలన్న దానిపై సమావేశంలో ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. రెవెన్యూ భవన్లో బొప్పరాజు, బండి శ్రీనివాసరావు భేటీ కానున్నారు.
21వ తేదీన (శుక్రవారం) ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వాలన్న ఆలోచనలో ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. సమ్మె నోటీసు ఇచ్చిన అనంతరం ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయం… అన్ని జిల్లాల్లో ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
శుక్రవారం నుంచి దశలవారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసే విధంగా సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. గురువారం సాయంత్రం అమరావతి జేఏసీ ఎన్జీవో, జేఏసీ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించనున్నాయి.
ఉద్యోగులకు లక్ష్మీనారాయణ మద్దతు
ఇలా ఉండగా, ఉద్యోగుల సమస్యలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఉద్యోగులు పాలనలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. ఉద్యోగుల ఆకాంక్షలు, ప్రయోజనాలకు విరుద్ధమైన వేతన సవరణ ఫిట్మెంట్, డీఏ, హెచ్ ఆర్ ఎ స్లాబ్‌ల జిఓలను ఏపీ ప్రభుత్వం సవరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఉద్యోగులతో చర్చలు జరిపి పరిష్కారానికి రావాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జలను ఆయన ట్యాగ్ చేశారు.