ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడలో రాయితో దాడి జరిగి, గాయపరచి రెండు రోజులు అవుతున్నా ఇంకా పోలీసులు దాడి చేసిన వారి ఆచూకీ తెలుసుకోలేక పోయారు. దానితో సిఎం జగన్ పై దాడి చేసినవారి వివరాలను తెలిపినవారికి నగదు బహుమతి ఇస్తామని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎన్టిఆర్ జిల్లా పోలీస్ కమిషనర్వారి కార్యాలయం సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై శనివారం జరిగిన దాడికి సంబంధించిన నిందితులను పట్టుకోవడానికి దోహదపడే కచ్చితమైన సమాచారమును, దృశ్యాలను (సెల్ ఫోన్, వీడియో రికార్డింగ్స్) అందించవచ్చని తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కూడా నేరుగా వచ్చి సమాచారమును అందించవచ్చునని తెలిపారు.
ఈ విధముగా కేసుకు దోహదపడే సమాచారం అందించినవారికి 2 లక్షల రూపాయల నగదును బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఈ సమాచారమును అందించిన వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని చెప్పారు. దాడికి సంబంధించిన కచ్చితమైన సమాచారము తెలియజేయాలనుకునేవారు ఈ దిగువ తెలుపబడిన వారికి ఫోన్ ద్వారా గాని, వాట్స్ అప్ ద్వారా గాని, లేదా నేరుగా గాని వచ్చి తెలియజేయగలరని వివరించారు.
ఫోన్ నెంబర్లు : 1. కంచి శ్రీనివాసరావు, డి.సి.పి. ఎన్.టి.ఆర్. పోలీస్ కమిషనరేట్ – 9490619342
2. ఆర్.శ్రీహరిబాబు, ఏ.డి.సి.పి.టాస్క్ ఫోర్సు – 9440627089
ఆఫీస్ అడ్రస్ : కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ కార్యాలయం, నేతాజీ బ్రిడ్జి రోడ్, పశువుల ఆసుపత్రి పక్కన, లబ్బిపేట్, కృష్ణలంక, విజయవాడ.