లోక్‌సభ ఎన్నికల్లోనగదు ప్రవాహం జోరుగా సాగుతోంది. మొదటి దశ పోలింగ్‌కు ముందే ఇప్పటివరకు గతంలో ఎన్నడూ ఎరుగనంత భారీస్థాయిలో సుమారు రూ. 4,650 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్ (ఇసి) ప్రకటించింది. ఎన్నికల చరిత్రలో సీజ్ చేసిన నగదులో ఇదే అత్యధిక మొత్తమని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
మార్చి 1నుండి ప్రతి రోజూ రూ. 100 కోట్లకు పైగా నగదును సీజ్ చేస్తున్నట్లు ఇసి తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో జప్తు చేసిన మొత్తం రూ.3,475 కోట్లు కాగా, ఈ ఎన్నికల్లో నగదు జప్తు భారీగా పెరిగినట్లు వెల్లడించింది. 2019 ఎన్నికలతో పోలిస్తే .. డ్రగ్స్‌ను కూడా భారీగా సీజ్ చేసినట్లు ఇసి తెలిపింది.
2019 ఎన్నికల సమయంలో రూ.1,279.9 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేయగా, ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు రూ.2,068.8 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అంటే మొత్తం స్వాధీనం చేసుకున్న వాటిలో 45 శాతం డ్రగ్స్ మాత్రమే. ఎన్నికల్లో అవకతవకలను అరికట్టడానికి, నగదు బదిలీలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో వివరించేందుకు ఈ ప్రకటన విడుదల చేసినట్లు ఇసి తెలిపింది.
ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ఈసీ స్వాధీనం చేసుకున్న మొత్తం రూ. 4,658 కోట్లలో రాజస్థాన్ తొలి స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకూ మొత్తం రూ. 778.52 కోట్లు స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత రూ. 605 కోట్లతో గుజరాత్ తర్వాతి స్థానంలో నిలిచింది.
ఇక తమిళనాడులో రూ.460.8 కోట్లు, మహారాష్ట్రలో రూ.431.3 కోట్లు, పంజాబ్‌లో రూ. 311.8 కోట్లు పట్టుబడింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి రూ. 121.84 కోట్ల మేర రికవరీ చేసుకోగా, ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 125.97 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల అక్రమాలు, అవకతవకల్లో అత్యల్పంగా లద్దాక్, లక్షద్వీప్ ప్రాంతాలు నిలిచాయి.
లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఈ దశలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, జమ్ముకాశ్మీర్, లక్షద్వీప్ మరియు పుదుచ్చేరి రాష్ట్రాల్లోని ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు.