హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని భారత ఎన్నికల కమిషన్ శనివారంనాడు సవరించింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1న జరగాల్సిన పోలింగ్ తేదీని అక్టోబర్ 5వ తేదీకి మార్చింది. దీనితో పాటు జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లెక్కించే తేదీని కూడా అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 8వ తేదీకి మార్చింది.
బిష్ణోయ్ కమ్యూనిటీ ఓటింగ్ హక్కులను, శతాబ్దాలుగా వారు అనుసరిస్తున్న అసోజ్ అమావాస్య ఫెస్టివల్ సెలబ్రేషన్లను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల తేదీని సవరించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. అక్టోబర్ 1వ తేదీ పోలింగ్‌ను రీషెడ్యూల్ చేయాల్సిందిగా ఆల్ ఇండియా బిష్ణోయ్ మహాసభ, బికనీర్ (రాజస్థాన్) జాతీయ అధ్యక్షుడు తమకు లేఖ రాసినట్టు తెలిపింది.
ఈ ఏడాది బిష్ణోయ్ కమ్యూనిటీ ఫెస్టివల్ అక్టోబర్ 2న జరుగనుందని, ఇందుకోసం సిర్సా, ఫతేబాద్, హిసార్‌లోని వేలాది కుటుంబాలు రాజస్థాన్ వెళ్తారని, అక్టోబర్ 1న ఎన్నికలైనందున వారు తమ ఓటింగ్ హక్కును వినియోగించుకోలేరని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈసీ తాజా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. గతంలో కూడా వివిధ కమ్యూనిటీల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ తేదీలను ఈసీ సవరించినట్లు వివరించింది.