ఏపీలో గత వారం కలకలం రేపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో క్రమంగా పురోగతి లభిస్తోంది. ఈ కేసులో జగన్ పై రాయి విసిరిన ఘటనకు కారకులుగా భావిస్తున్న ఐదుగురు అనుమానితుల్ని సెంట్రల్ నియోజకవర్గంలోని వడ్డెర కాలనీ నుంచి అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
వీరిలో సతీష్ ఏ వ్యక్తి రాయి విసిరిన్నట్లు గుర్తించారు. అయితే, ఎందుకు విసిరాడో ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తున్నది. అతనితో పట్టున్న మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
విజయవాడ వన్ టౌన్ లోని సీసీఎస్ లో వీరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే వీరిలో ఓ అనుమానితుడిని సీఎం జగన్ తో పాటు దాడికి గురైన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు చూపించారు. వడ్డెర కాలనీకి చెందిన యువకులే సీఎం జగన్ పై రాయి విసిరినట్లు విజయవాడ పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కోణంలోనే ఇప్పుడు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
వైసీపీ నేతలు ఎయిర్ గన్ తో పెల్లెట్ ప్రయోగించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేసినా పోలీసులు మాత్రం రాయి దాడి కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. దీంతో రాయిదాడి చేసే అవకాశం ఉన్న స్ధానికుల్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రత్యక్షంగా ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడం పోలీసులకు సమస్యగా మారుతోంది.
జగన్ పై దాడి సమయంలో సీసీ ఫుటేజ్ తో పాటు ఫోన్ కాల్స్ రికార్డుల్ని కూడా స్వాధీనం చేసుకున్నప్పటికీ ఇందులో ఎక్కడా క్లారిటీ రావడం లేదు. దీంతో పోలీసులపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పది మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుున్నారు.
వీరి నుంచి ఏదైనా క్లూ దొరికితే సరి లేకపోతే రూటు మార్చి అరెస్టులు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఘటనపై విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటాను పిలిపించి సీఈవో వివరణ తీసుకున్నారు. దీన్ని ఈసీకి నివేదించబోతున్నారు.