పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ప్రతిపాదించిన కూచ్ బెహర్ పర్యటననను రద్దు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) సూచించింది. ఈ నెల 18, 19 తేదీల్లో తలపెట్టిన ఆయన పర్యటన మోడల్ కోడ్ను ఉల్లంఘించినట్లువుతుందని తెలిపింది.
ఎన్నికల ప్రక్రియలో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని, అందుకే కూచ్ బెహర్ను సందర్శిస్తున్నారని బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ అక్కడ పర్యటించకుండా అడ్డుకోవాలని కోరుతూ ఈసీకి లేఖ రాసింది. స్పందించిన ఈసీ ఈ నెల 18, 19 తేదీల్లో కూచ్ బెహర్లో పర్యటించవద్దని గవర్నర్కు సూచించింది.
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరుగనున్నది. దీంతో బుధవారం సాయంత్రంతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. అలాగే 48 గంటలపాటు సైలెంట్ సమయాన్ని పాటించాల్సి ఉంటుంది. నియోజకవర్గంలో ఓటర్లు కాని వీఐపీలు, నాయకులు ఆ ప్రాంతాన్ని వీడాల్సి ఉంటుంది.
స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంతోపాటు వీఐపీల భద్రత కోసం పోలీసులు, భద్రతా సిబ్బందిపై అదనపు పనిభారం పడకుండా ఉండేందుకు ఈ నియమం పాటిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో కూచ్ బెహర్ పర్యటనను బెంగాల్ గవర్నర్ రద్దు చేసుకోవాలని కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది.