* రాహుల్ కు వయనాడ్ సీటు కూడా దక్కదన్న మోదీ
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు కుటుంబ సంబంధాల గురించి కాదని, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య సంగ్రామమని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పుణె జిల్లాలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్‌సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
కన్హేరీలోని హనుమాన్ ఆలయంలో శనివారం పూజలు నిర్వహించిన అనంతరం ఆమె అధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అజిత్ పవార్‌తోపాటు ఆయన కుమారులు పునీత్, జై, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సునేత్రకు ప్రత్యర్థిగా అజిత్ పవరా సోదరి, శరద్ పవార్ కుమార్తె, మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన సుప్రియా సూలె పోటీ చేస్తున్నారు. ఎన్‌సిపి(శరద్ పవార్) తరఫున పోటీ చేస్తున్న సుప్రియ, అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్‌సిపి తరఫున పోటీ చేస్తున్న సునేత్ర గురువారం తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
ముందు జాగ్రత్తగా అజిత్ పవార్ కూడా ఈ స్థానానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా అజిత్ పవార్ ప్రసంగిస్తూ ఈ ఎన్నికలు కుటుంబ సంబంధాల గురించి కాదని, ఇవి ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ మధ్య జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు.
కాగా..హనుమాన్ ఆలయం నుంచే సుప్రియా సూలె కూడా తన తండ్రి శరద్ పవార్ , ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో శుక్రవారం తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం విశేషం. బారామతిలో మే 7న పోలింగ్ జరగనుంది.
మరోవంక, ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై ధ్వజమెత్తారు. ‘‘కాంగ్రెస్ సాహెబ్జాదే వయనాడ్ సీటును కూడా కోల్పోతారు. ఆ తర్వాత ఆయన తనకు సురక్షితమైన సీటెక్కడ అని వెతుక్కుంటారు’’ అని జోస్యం చెప్పారు. మహారాష్ట్రలోని నాందేడ్ లో ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయం చెప్పారు.
ఆయన నాందేడ్, హింగోలి సీట్ల అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ ఈ విషయం చెప్పారు. లోక్ సభ ఎన్నికలు ఎన్ డిఏ పక్షంలో ఏకపక్షంగా ఉండనున్నాయని తెలిపారు. అయితే, ఇండియా బ్లాక్ లో ఉన్న నాయకులు (సోనియా గాంధీని ఉద్దేశించి) లోక్ సభ నుంచి రాజ్యసభకు జంపయ్యారని, వారికి పోటీ చేసే దమ్ము లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పాలనలో చేసిన తప్పులను సరిచేయడంలోనే తన పదేళ్ల పాలన గడిచిందని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని మోదీ తెలిపారు. వ్యవసాయ సంక్షోభం అన్నది ఇప్పుడే ఏర్పడలేదని, అది కాంగ్రెస్ తప్పుడు విధానాల వల్లే ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇండియా బ్లాక్ ను కూడా విమర్శించారు.