ఈవీఎంలను అనుమానించిన ప్రతిపక్ష నేతలు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ డిమాండ్ చేశారు. బిహార్‌లోని అరారియా, ముంగేర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం ప్రకటించారు. ‘‘ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం’’ అని వ్యాఖ్యానించారు.
ఇక ప్రతిపక్ష పార్టీలు తమకు ఎంతో ఇష్టమైన ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని ఆరోపించారు. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను ఓటు బ్యాంకు రాజకీయాలకు మళ్లించడాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోనని.. ఇది మోదీ గ్యారెంటీ అని హామీ ఇచ్చారు. దేశ వనరులపై తొలి హక్కు పేదలకే ఉంటుందని స్పష్టం చేశారు.
బిహార్‌లో కాంగ్రెస్, ఆర్జేడీ, ఇతర ఇండియా కూటమి పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకొని.. పేదలు, వెనకబడిన వర్గాలు, దళితుల ఓటు హక్కును హరించేవారని ఆరోపించారు. ఈవీఎంలు వచ్చిన తర్వాత వారి ఆటలు సాగడం లేదన్నారు. అందుకే ప్రతిపక్ష నేతలు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
ముస్లింలకు కాంగ్రెస్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని, ఇండీ కూటమి తీరును తేటతెల్లం చేయడంతో వారంతా ఆగ్రహంగా ఉన్నారని మోదీ చెప్పారు. తనను భయపెట్టాలని చూడొద్దని హెచ్చరించారు. ‘25 ఏళ్లుగా నన్ను భయపెట్టాలని చూస్తూనే ఉన్నారు. కానీ, విఫలమయ్యారు’ అని చెప్పారు.
కాగా, పశ్చిమ బెంగాల్లో టిఎంసి, కాంగ్రెస్ ఘర్షణ పడుతున్నట్టు నటిస్తున్నాయని, అయితే ఈ రెండు పార్టీల స్వభావం, సిద్ధాంతం ఒక్కటేనని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. మాల్దాలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ సంతుష్టీకరణ కోసం ఈ రెండు పార్టీలు ఏం చేసేందుకైనా వెనుకాడవని దుయ్యబట్టారు.
దేశ భద్రత కోసం తాము తీసుకున్న నిర్ణయాలను తిరగతోడాలని ఇరు పార్టీలు కోరుకుంటున్నాయని చెప్పారు. ఆర్టికల్ 370 పునరుద్ధరించాలని ఇండియా కూటమి కోరుకుంటోందని, సీఏఏను రద్దు చేస్తామని టీఎంసీ చెబుతోందని ప్రధాని పేర్కొన్నారు. పేదల ఆస్తులను దర్యాప్తు చేస్తామని కాంగ్రెస్ వెల్లడించిందని ఆరోపించారు.
వారు విదేశాల నుంచి ఎక్స్‌రే మిషన్‌ను తీసుకొచ్చి దేశంలోని అందరిపై ఎక్స్‌రే చేపడతారని ప్రధాని ఎద్దేవా చేశారు. మీ నగలు, ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుని వాటిలో కొంత భాగం తమ ఓటు బ్యాంకుకు పంచాలని వారు భావిస్తున్నారని హెచ్చరించారు. కాంగ్రెస్ వ్యాఖ్యలపై టీఎంసీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనం దాల్చుతోందని మండిపడ్డారు.
మీ భూములను టీఎంసీ బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులకు పంచేస్తే, కాంగ్రెస్ మీ ఆస్తులను తమ ఓటు బ్యాంక్‌కు పంచడం గురించి మాట్లాడుతోందని దుయ్యబట్టారు. మీ జీవితాంతం, మరణానంతరం కూడా కాంగ్రెస్ లూటీ కొనసాగుతుందని హెచ్చరించారు.