ఉత్తరాఖండ్ ప్రభుత్వం పతంజలికి చెందిన 14 ఉత్పత్తుల లైసెన్సులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్, మ్యాజిక్ రెమెడీస్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు పతంజలిపై ఫిర్యాదు అందింది. పతంజలికి చెందిన స్వసారి గోల్డ్, స్వసరి వాటి, బ్రోంకోమ్, స్వసారి ప్రవాహి, స్వసరి అవలేహ్, ముక్తావతి ఎక్స్ట్రా పవర్, లిపిడమ్, బిపి గ్రిట్, మధుగ్రిట్, మధునాశిని వాటి ఎక్స్ట్రా పవర్, లివామృత్ అడ్వాన్స్, లివోగ్రిట్, ఐగ్రిట్ డాక్టర్ ఎగ్రిట్ గోల్డ్, పతంజలి లైసెన్సులు సస్పెండ్ చేశారు.
పతంజలి ఆయుర్వేద ఆరోగ్య నివారణలపై తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రసారం చేయకుండా నిషేధించిన కోర్టు ఆదేశాలను ధిక్కరించడంపై రామ్‌దేవ్, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా, పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌కు సంబంధించిన తప్పుదారి పట్టించే వ్యాపార ప్రకటనల కేసులో చర్యలు తీసుకోనందుకు ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీని సుప్రీంకోర్టు మంగళవారం తీవ్రంగా మందలించింది. సంస్థ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 19న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసిన తర్వాత లైసెన్సింగ్ అథారిటీ నుంచి చర్యలు మొదలైనట్లు కనపడుతోందని పేర్కొంది.
“మీ పట్ల సానుభూతి కలగాలంటే నిజాయితీగా మాట్లాడండి” అంటూ లైసెన్సింగ్ అథారిటీని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో లైసెన్సింగ్ అథారిటీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుందా లేదా అన్నదే తమ ప్రధాన ప్రశ్న అని ధర్మాసనం తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను మే 14వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనలపై తమ ఆదేశాలను పాటించనందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని రామ్‌దేవ్, అతని సహాయకుడు ఆచార్య బాలకృష్ణన్, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్‌కు సుప్రీం కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
పతంజలి ఉత్పత్తులు వివిధ వ్యాధులను నయం చేయగలవని ఇచ్చిన ప్రకటనలపై రామ్‌దేవ్, బాలకృష్ణలను ధర్మాసనం ప్రశ్నించింది.
ఇది స్పష్టమైన ఉల్లంఘన అని ఆగ్రహం వ్యక్తం చేసింది. రామ్‌దేవ్, బాలకృష్ణ ఇద్దరూ పతంజలి జారీ చేసిన ప్రకటనలపై సుప్రీం కోర్టు ముందు క్షమాపణ చెప్పారు.
“గౌరవనీయమైన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో కొనసాగుతున్న కేసు నేపథ్యంలో సుప్రీం ఆదేశాలు/ఆజ్ఞలను పాటించనందుకు లేదా పాటించనందుకు మా వ్యక్తిగత సామర్థ్యంతో పాటు కంపెనీ తరపున మేము బేషరతుగా క్షమాపణలు కోరుతున్నాము ” అని రామ్ దేవ్ బాబా పత్రికా ముఖంగా ప్రకటన ఇచ్చారు.
అయితే, ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వ్యాపార ప్రకటనలు ఇచ్చిన కేసులో యోగా గురు రాందేవ్, ఆయన సహచరుడు బాలకృష్ణ, పతంజలి ఆయుర్వేద సంస్థ వార్తాపత్రికలలో ప్రచురించిన బహిరంగ బేషరతు క్షమాపణలో గణనీయమైన మెరుగుదల ఉందని సుప్రీంకోర్టు మంగళవారం ప్రశంసించింది.
క్షమాపణ చెప్పిన భాష తగిన విధంగా ఉందని, పేర్లు కూడా అందులో ఉన్నాయని ధర్మాసనం మంగళవారం సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీకి తెలిపింది. రెండవ క్షమాపణ ఎవరి ఆలోచనో తెలియదు కాని గణనీయమైన మెగరుదల ఉందని జస్టిస్ అమానుల్లా అన్నారు. మొత్తానికి అర్థిం చేసుకున్నందుకు వారిని అభినందిస్తున్నామని ఆయన చెప్పారు.