హైదరాబాద్ లోక్‌సభ నియోజవర్గంలో ఈసారి రజాకార్ల ప్రతినిధిని ఓడించాలని, బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపిచ్చారు. 40 ఏళ్లుగా హైదరాబాద్ నుంచి పార్లమెంటులో రజాకార్ల ప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.
బుధవారం సాయంత్రం అమిత్ షా హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. పాతబస్తీ లాల్ దర్వాజ మహంకాళి ఆలయం నుంచి శాలిబండలోని సుధా టాకీస్ వరకు నిర్వహించిన రోడ్‌షోలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ అభ్యర్థి మాధవిలతలతో కలిసి పాల్గొన్నారు. ప్రచార సమయం ముగుస్తుండటంతో సభలో.. అమిత్ షా క్లుప్తంగా మాట్లాడారు.
రజాకార్ల పాలన నుంచి హైదరాబాద్‌కు ముక్తి కల్పించాలని, బీజేపీ అభ్యర్థి మాధవిలతను గెలిపించాలని, నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా బీజేపీ గెలవబోయే 400 ఎంపీ సీట్లలో ఒకటి హైదరాబాద్ నుంచి ఉండాలని స్పష్టం చేశారు.
హైదరాబాదులో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఇక్కడి ప్రజలను తాకే ధైర్యం ఎవరికీ లేదని చెప్పారు. హిందువులైనా, ముస్లింలైనా ఈసారి బీజేపీకి ఓటేసి గెలిపించాలని కేంద్ర మంత్రి కోరారు. కాగా, అమిత్ షా రోడ్‌షోలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దర్శనం ఇవ్వడంతో కార్యకర్తలు ఉత్సాహంతో ఊగిపోయారు.
అభ్యర్థి మాధవిలత సంతోషంతో రాజాసింగ్ చేతులు పట్టుకొని పైకి ఎత్తి నినాదాలు చేశారు. మాధవిలతకు పార్టీ టికెట్ కేటాయించినప్పటి నుంచి రాజాసింగ్ అసంతృప్తితో ఉన్నారు. ఇన్ని రోజులు ప్రచారానికి దూరంగా ఉన్న ఆయన రాత్రి ఒక్కసారి ఆయన కనిపించడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.
పాతబస్తీలో అమిత్‌షా రోడ్ షో అనుకున్న సమయానికి నాలుగు గంటలు ఆలస్యంగా జరిగినా బీజేపీ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. రాత్రి 9.25 గంటలకు ఆయన లాల్‌దర్వాజ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 9.33 గంటలకు దేవాలయం నుంచి రోడ్డు షో మొదలైంది.
రోడ్‌షో తర్వాత నిర్వహించిన సభలో ప్రచార సమయం ముగుస్తుండటంతో కేవలం ఒకటిన్నర నిమిషం మాత్రమే అమిత్ ప్రసంగించారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తరఫున పార్టీ అగ్రనేత ప్రచారానికి రావడంతో కార్యకర్తలు ఉత్సాహంలో మునిగిపోయారు.