ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి నాటకం ఆడుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. తీవ్రమైన ఫోన్ ట్యాపింగ్ కేసు ఊసే లేదని, ఆ రెండు పార్టీలు కుమ్మక్కై ట్యాపింగ్ కేసును నీరుగార్చాయని విమర్శించారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు కరీంనగర్ కు చెందిన ఓ కాంగెర్స్ మంత్రి యత్నిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీబీఐకి ఇవ్వకపోతే ఈ కుంభకోణంతో హస్తం పార్టీ సంబంధం ఉన్నట్లే. ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని అనుమానం కలుగుతుందని స్పష్టం చేశారు.
ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్‌రావు చెప్పారని, ఆయన ఏం చెప్పారో పోలీసు రికార్డులో ఉందని తెలిపారు. పెద్దలు చెబితేనే తాము ఈ పని చేసినట్లు రాధాకిషన్‌రావు స్టేట్మెంట్ కూడా ఇచ్చారని బండి సంజయ్ వెల్లడించారు.
“ఫోన్ ట్యాపింగ్‌లో నేను, రేవంత్‌రెడ్డి కూడా బాధితులమే. ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడే కాదు, అసెంబ్లీ ఎన్నికల నుంచి జరుగుతోంది. నా కుటుంబసభ్యులు, సిబ్బంది ఫోన్లనూ ట్యాప్ చేశారు. 317 జీవో, టీఎస్పీఎస్సీ వివాదంలోనూ నా అరెస్టుకు ఫోన్ ట్యాపింగే కారణం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీశ్‌రావు కూడా బాధితుడే. ప్రభాకర్‌రావు వియ్యంకుడు అశోక్‌రావు కరీంనగర్ వాసి. అన్ని ఆర్థిక లావాదేవీలు నడిపింది ప్రభాకర్‌రావు వియ్యంకుడు అశోక్‌రావే.” అని సంజయ్ వివరించారు.
కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తున్న రాజేందర్రావు ఖర్చులన్నీ అశోక్‌రావే చూస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఆయన ఇంట్లోనే రాజేందర్రావు ఉన్నారని అన్నారు. ప్రభాకర్‌రావు, అశోక్‌రావు ద్వారా కాంగ్రెస్ నేతలకు రూ.కోట్లు చేరాయని తెలిపారు. గల్లీ నుంచి దిల్లీ వరకు డబ్బులు చేతులు మారాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన డబ్బు ప్రభాకర్‌రావు హస్తం పార్టీకి ఇచ్చారా అని బండి సంజయ్ ప్రశ్నించారు.