దేశీయంగా చమురును వెలికితీయడం ద్వారా భారతదేశానికి ఇంధన భద్రతను అందిండచంతోపాటు విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుకునేందుకు వీలుపడుతుందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు.
విశాఖపట్టణంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) ప్రథమ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ దేశీయంగా చమురు ఉత్పత్తిని పెంచేందుకు పెట్రోకెమికల్ రంగంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్&డీ)కి మరింత ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తద్వారా భారతదేశ ఇంధన అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
శక్తి ఉత్పాదన రంగంలో ఆత్మనిర్భరత సాధించాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, దేశీయంగా చమురు ఉత్పత్తిని, పెట్రోకెమికల్స్ ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించాలని సూచించారు. భారతదేశంలో పునరుత్పాదక విద్యుదుత్పత్తికి విస్తృతమైన అవకాశాలున్నాయన్న ఆయన, ఈ దిశగా వినూత్నమైన, సృజనాత్మకమైన ఆలోచనలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశంగా ఉన్న భారత్, తన అవసరాలకోసం 80 శాతం విదేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు. పెట్రో నిల్వలున్న ప్రాంతంలో చమురు వెలికితీతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం హైడ్రోకార్బన్ ఎక్స్ ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీ (హెల్ప్)తో పాటు వివిధ విధానపరమైన సంస్కరణలు తీసుకువస్తోందని తెలిపారు.
పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన డిమాండ్ పెరుగుతోందన్న ఉపరాష్ట్రపతి, 2045 నాటికి భారతదేశం ఇంధన డిమాండ్ రేటు 3 శాతం చొప్పున కన్నా ఎక్కువగా పెరుగుతుందని చెప్పారు. అదే సమయంలో మిగిలిన దేశాల ఇంధన డిమాండ్ రేటు 1 శాతం చొప్పున కంటే తక్కువగా ఉండనుందనే విషయాన్ని గుర్తుచేశారు.
ఇందుకోసం పెట్రోలియం రంగంలో నైపుణ్యత కలిగిన మానవ వనరుల అభివృద్ధిని పెంచుకునేందుకు ఉన్న అడ్డంకులను అధిగమించాలని, విశ్వవిద్యాలయాలు-పరిశ్రమల మధ్య అనుసంధానతను పెంచుకోవడం ద్వారా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ముందుడుగేసేందుకు ప్రయత్నించాలని వెంకయ్యనాయుడు సూచించారు.
ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన పరిశోధనలు చేసేదిశగా పీహెచ్ డీ విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్న ఆయన, విద్యారంగంలోనూ వివిధ అంశాలను ఒకేసారి నేర్చుకునేందుకు వీలు కల్పించాలని చెప్పారు. నూతన విద్యావిధానం – 2020 ఈ దిశగా బాటలు వేస్తుందని ఉపరాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు.
భారతదేశంలో సౌర, పవన, అలల ద్వారా, వివిధ మార్గాల్లో పునరుత్పాదక విద్యుదుత్పత్తిని చేసేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయన్న ఉపరాష్ట్రపతి, ఈ శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఇందుకోసం ఐఐపీఈ వంటి విశ్వవిద్యాలయాలు ప్రత్యేకమైన శిక్షణను అందించాలని ఆయన సూచించారు. ఈ దిశగా జరుగుతున్న ప్రతి చిన్న ప్రయత్నాన్ని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తద్వారా ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణ వ్యవస్థకు లాభం చేసిన వారమవుతామని తెలిపారు.
ఈ దిశగా ఐఐపీఈ అనుకున్న లక్ష్యాలను చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, పెట్రోకెమికల్ రంగంలో అవసరమైన పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఐఐపీఈలోని అపారమైన అనుభవమున్న అధ్యాపకులు విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్నారని అయన కొనియాడారు.