మెగాస్టార్ చిరంజీవి దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ గురువారం రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంటే వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన ఎంతో సంతోషంగా కనిపించారు.
నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ అభిమానులను అలరిస్తూ మెగాస్టార్ బిరుదు అందుకున్న కొణెదలచిరంజీవికి ఈ ఏడాది దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చిరంజీవితోపాటు ఆయన భార్య సురేఖ, తనయుడు రామ్ చరణ్, అతని భార్య ఉపాసన కూడా ఢిల్లీ వెళ్లడం విశేషం.
చిరంజీవి అవార్డు అందుకుంటుండగా ప్రేక్షకుల్లో ఉన్న చరణ్, ఉపాసన కూడా ఎంతో ఆనందంగా చప్పట్లు కొడుతూ కనిపించారు. చిరంజీవి కాకుండా వైజయంతిమాల, మిథున్ చక్రవర్తి, విజయ్‌కాంత్, ఉషా ఉతుప్ లకు ఈసారి పద్మ అవార్డులను ప్రకటించారు.
రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 90 ఏళ్ల వైజయంతిమాల బాలి కూడా పద్మ విభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు.
సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఎం ఫాతీమా బీవీ, బాంబే సమాచార్ వ్యవస్థాపకుడు హోర్ముస్జీ ఎన్ కామాబిజెపి నాయకుడు ఓ రాజగోపాల్, లడఖ్ ఆధ్మాత్మిక గురువు తోగ్దన్ రిన్పోచే(మరణానంతరం), తమిళ నటుడు కెప్టెన్ విజయకాంత్(మరణానంతరం), గుజరాతీ వార్తాపత్రిక జన్మభూమి గ్రూపు ఎడిటర్, సిఇఓ కుందన్ వ్యాస్‌కు పద్మ భూషణ్ పురస్కారాల ప్రదానం జరిగింది.
ఫాతీమా బీవీ, విజయకాంత్, రిన్పోచే తరఫున వారి కుటుంబ సభ్యులు రాష్ట్రపతి నుంచి అవార్డులు స్వీకరించారు. ఈ ఉత్సవానికి ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితర ప్రముఖులు హాజరయ్యారు.
2024 సంవత్సరానికి 132 మందికి పద్మ అవార్డులను అందచేయడానికి రాష్ట్రపతి ఆమోదించారు. వీటిలో 5 పద్మ విభూషణ్, 17 పద్మ భూషణ్ , 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డుకు ఎంపికైన వారిలో 30 మంది మహిళలు ఉన్నారు. ఏప్రిల్ 22న సగం మందికి పద్మ అవార్డుల ప్రదానం జరుగగా మిగిలిన వారు గురువారం అవార్డులను స్వీకరించారు.