సార్వత్రిక ఎన్నికల సమరం నాలుగో దశలో 67.25 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం రాత్రి 11.45 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం.. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 స్థానాల్లో ఈ మేరకు పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈసీ వెల్లడించిన వివరాలను బట్టి.. ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ 76.5 శాతంగా, తెలంగాణలో 64.74 శాతంగా ఉంది. ఏపీ (25), తెలంగాణ(17)లోని మొత్తం ఎంపీ స్థానాలతో పాటు యూపీ (13), మహారాష్ట్ర (11), పశ్చిమబెంగాల్ (8), మధ్యప్రదేశ్ (8), బిహార్ (5), ఝార్ఖండ్ (4), ఒడిశా (4), జమ్ముకశ్మీర్ (1)లోని పార్లమెంటు స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి.
సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి ఈ 96 స్థానాల్లో.. ఈవీఎంల మొరాయింపు, ఏజెంట్ల అడ్డగింత వంటి 1700 ఫిర్యాదులు నమోదయ్యాయి. పశ్చిమబెంగాల్లో 8 స్థానాల్లో టీఎంసీ, కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో మూడు పార్టీలూ పరస్పరం వందలాది ఫిర్యాదులు చేసుకున్నాయి.
మొత్తం ఏడు దశల్లో ఈసీ ఈ ఎన్నికలను నిర్వహిస్తుండగా.. తాజాగా పూర్తయిన నాలుగో దశతో దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 379 స్థానాల్లో పోలింగ్ ముగిసినట్టయింది. అలాగే.. ఏపీ, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాలన్నింటికీ, ఒడిశాలో 28 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు ముగిశాయి.
కడపటి వార్తలు అందే సమయానికి వీటిలో పశ్చిమబెంగాల్లో అత్యధికంగా 78.37 శాతం పోలింగ్ నమోదు కాగా.. శ్రీనగర్ నియోజకవర్గంలో అతి తక్కువగా 37.98 శాతం ఓటింగ్ నమోదైంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న ఈ తొలి ఎన్నికల్లో 38 శాతం అంటే మనకు తక్కువ అనిపించవచ్చుగానీ.. గత కొన్ని దశాబ్దాల్లో ఇదే అక్కడ అత్యధికం అని ఈసీ ప్రకటించడం గమనార్హం.
ఇక.. బిహార్‌లో 57.06%, ఝార్ఖండ్‌లో 65.2%, మధ్యప్రదేశ్‌లో 70.98ు, మహారాష్ట్రలో 59.64%, ఒడిశాలో 73.97%, ఉత్తరప్రదేశ్‌లో 58.05% ఓటింగ్ నమోదైంది. సార్వత్రిక ఎన్నికల మొదటి మూడు దశల్లో వరుసగా 66.14%, 66.71%, 65.68% ఓటింగ్ నమోదైన సంగతి తెలిసిందే.
కాగా.. ఇప్పటిదాకా జరిగిన నాలుగు దశల ఎన్నికలతో ప్రజల తీర్పు ఎన్డీయే కూటమికే అనుకూలంగా ఉన్నదన్న విషయం స్పష్టమైందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దేశం నలుమూలలా ఎన్డీయే అభ్యర్థులకు మంచి మద్దతు లభిస్తోంది. ఇండియా కూటమి అసలు ప్రజల చర్చల్లోనే ఉండట్లేదని ఎద్దేవా చేశారు. శ్రీనగర్‌లో ప్రజలు దైర్యంగా వచ్చి ఓటేశారంటూ మోదీ కొనియాడారు.