ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని బాన్స్వారాలో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో చొరబాటుదారులు.. అధిక సంఖ్యలో పిల్లల్ని కంటారు అని చేసిన వాఖ్యలు ముస్లింల గురించే అన్నారని అంటూ రాజకీయ దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎఐఎంఐఎం చీఫ్ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ తదితరులు తీవ్రంగా ఖండించారు.
తాజాగా ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ న్యూస్ 18 టీవీ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. తాను కేవలం ముస్లింల గురించి మాత్రమే మాట్లాడలేదని, ప్రతి పేద కుటుంబం గురించి మాట్లాడానని స్పష్టం చేశారు. హిందూ- ముస్లిం అంటూ రోజును ప్రారంభించినరోజు ప్రజాజీవితానికి అనర్హుడవుతాడు అని ఆయన చెప్పారు. ముస్లింల పట్ల ప్రేమను తాను మార్కెట్ చేసుకోనని ఎద్దేవా చేశారు.
తాను ఓటు బ్యాంక్ కోసం పనిచేయనని, కేవలం సబ్కా సాత్, సబ్కా వికాస్‌నే నమ్ముతానని మోదీ తెలిపారు. ‘నేను ఆశ్చర్యపోయాను. ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడల్లా వారు ముస్లింలు అని మీకు ఎవరు చెప్పారు? ముస్లింల పట్ల ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు? పేద కుటుంబాల్లోనూ ఇదే పరిస్థితి. పేదరికం ఉన్నచోట, వారి సామాజిక సర్కిల్‌తో సంబంధం లేకుండా ఎక్కువమంది పిల్లలు ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు.
`నేను హిందువుగానీ, ముస్లిం గురించి గానీ ప్రస్తావించలేదు. నువ్వు చూసుకోగలిగినంత మంది పిల్లల్ని కనాలి అని చెప్పాను. మీ పిల్లలను ప్రభుత్వమే చూసుకోవాల్సిన పరిస్థితి రావద్దు.’ అని ఈ ఇంటర్వ్యూలో ప్రధాని తెలిపారు. ‘ఈ సమస్య ముస్లింలకు సంబంధించింది కాదు. మోదీకి వ్యక్తిగతంగా ముస్లింలు ఎంత మద్దతు ఇస్తున్నారనే దానితో సంబంధం లేకుండా.. ‘ఇది చేయండి,’ అది చేయండి’ అని వారిని నిర్దేశించే ఆలోచనా ధోరణిగలవారిది’ అంటూ ధ్వజమెత్తారు.
“నా ఇంట్లో, నా చుట్టూ ముస్లిం కుటుంబాలన్నీ ఉన్నాయి. ఈద్ రోజున మా ఇంట్లో భోజనం వండేవారు కాదు. ముస్లింలే మాకు ఆహారాన్ని తెచ్చిపెట్టేవారు. నేటికీ నా స్నేహితుల్లో ముస్లింలే చాలామంది ఉన్నారు. 2002 (గోద్రా అల్లర్లు) తర్వాత నా ప్రతిష్ట దిగజారింది.’ అని ఆయన పేర్కొన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ముస్లింలు తనకు ఓటేస్తారా అని అడిగిన ప్రశ్నకు.. ‘దేశ ప్రజలు నాకే ఓటేస్తారు’ అని మోదీ సమాధానమిచ్చారు.