బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదుపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటి స్పందించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్త తో పాటు పలువురు అధికారులకు లోక్సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది.
ఫిబ్రవరి 3న తమ ముందు హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ నోటీసులు అందించింది. డీజీపీ మహేందర్ రెడ్డి, కరీంనగర్ సీపీ సత్యనారాయణ, ఏసీపీ శ్రీనివాస రావు, జగిత్యాల డీఎస్పీకి ప్రకాష్ తో పాటు కరీంనగర్ ఇన్స్పెక్టర్కు నోటీసులు జారీ చేసింది.
కాగా, సంజయ్ వాదనలను శుక్రవారం కమిటీ సభ్యులు విన్నారు. ఆయన అందించిన వీడియో క్లిప్ లను, పత్రికల కథనాలను పరిశీలించారు. తనపై దౌర్జన్యంగా వ్యవహరించారని, తనను అక్రమంగా ఆరోపించారని చెబుతూ వారిపై చర్యలు తీసుకోవాలని సంజయ్ కోరారు.
తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 317ను సవరించాలంటూ ఈ నెల 2న కరీంనగర్లోని తన కార్యాలయంలో దీక్ష చేపట్టానని చెబుతూ తన పట్ల పోలీసుల తీరును, అరెస్టును హైకోర్టు కూడా తప్పుపట్టిన విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.
కరీంనగర్ సీపీ సత్యనారాయణ, ఇతర పోలీసులు తనపై దాడి చేయడం ఇది రెండోసారని వివరించారు. 2019 అక్టోబర్లో ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఆర్టీసీ కార్మికుడు నగునూరు బాబు అంత్యక్రియలకు వెళుతుండగా పోలీసులు తనను అడ్డుకుని, క్రూరంగా దాడి చేశారని ప్రివిలేజ్ కమిటీకి సంజయ్ వెల్లడించారు.
తాజా ఘటన లో సీపీ సత్యనారాయణ, హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్రెడ్డి, జమ్మికుంట ఇన్స్పెక్టర్ కొమ్మినేని రాంచందర్రావు, హుజూరాబా ద్ ఇన్స్పెక్టర్ వీ.శ్రీనివాస్, కరీంనగర్ సీసీఎస్ ఏసీపీ కె.శ్రీనివాస్, కరీంనగర్ టూటౌన్ ఇన్స్పెక్టర్ చల్లమల్ల నరేశ్ సహా గుర్తు తెలియని ఇతర పోలీస్ సిబ్బంది ఈ నెల 2న తనపై దాడి చేశారని సంజయ్ వివరించారు.