ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. దాడి ఘటనపై స్వాతి మలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఫిర్యాదులో స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారు.
పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. బిభవ్ కుమార్ తనపై భౌతిక దాడికి పాల్పడినట్లు స్వాతి మలివాల్ పేర్కొన్నారు. సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని ఆరోపించారు. 7-8 సార్లు చెంపదెబ్బలు కొట్టి, కడుపుపై బలంగా కొట్టాడని, పొత్తికడుపుపై పదేపదే తన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో తాను పీరియడ్స్‌లో ఉన్నట్లు వెల్లడించారు. కర్రతో పలు మార్లు బాదినట్లు తెలిపారు.
కాగా, మే 13న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఈ దాడి ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఉదయం 9 గంటల సమయంలో కేజ్రీ నివాసంలోని డ్రాయింగ్ రూమ్‌లో వేచి ఉన్న సమయంలో సీఎం వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ ఆమెపై దాడి చేశాడు. ఆ సమయంలో కేజ్రీవాల్ కూడా ఇంట్లోనే ఉన్నట్లు మలివాల్ తెలిపారు.
అయితే ఎఫ్ఐఆర్లో మాత్రం కేజ్రీవాల్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. స్వాతిమలివాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బిభవ్‌ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో స్వాతిమాలివాల్కు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. దాడి జరిగిన సమయంలో ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు పరీక్షల్లో తేలింది.
కాగా ఈ ఘటనపై స్వాతిమాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో మహిళపై నేరపూరిత చర్యలకు పాల్పడినందుకుగాను ఐపిసిలోని 354, 506, 509, 323 సెక్షన్ల కింద బిభవ్‌కుమార్‌పై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. బిభవ్‌కు గురువారం సమన్లు జారీ చేసింది. శుక్రవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. అయితే అతను విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో స్వాతి గురువారం ఈ దాడికి సంబంధించి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
‘ఈ ఘటనపై తగిన విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. గడచిన కొన్నిరోజులు నాకు చాలా కఠినమైనవి. నా కోసం ప్రార్థించిన వారందరికీ నా కృతజ్ఞతలు. నా వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిని కూడా దేవుడు సంతోషంగా ఉంచాలి’ అని ఆమె తన ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే దేశంలో ముఖ్యమైన ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు స్వాతిమాలివాల్ సమస్య ముఖ్యం కాదు. దేశ సమస్యలే ముఖ్యం. ఈ ఘటనను రాజకీయం చేయవద్దు అని బిజెపి నేతలను ఆమె అభ్యర్థించారు.
ఈ నేపథ్యంలో మాలివాల్‌పై జరిగిన దాడికి బాధ్యత వహిస్తూ అరవింద్ కేజ్రీవాల్ తన సిఎం పదవికి రాజీనామా చేయాలని ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ డిమాండ్ చేశారు.
