వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా కరోనా సోకుతూ ఉండడం, పైగా ఎప్పటికప్పుడు కొత్త రకపు వేరియంట్లు వేస్తుండడంతో అన్ని వేరియంట్లకు కట్టడిగా రెండు కొత్త ఔషధాలపై లక్నోలోని సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూడ్ పరిశోధన చేస్తోంది. దాంతో ఎవరి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండే మందును రోగులకు అందజేసే కృషి చేస్తున్నారు.
కరోనా రోగులకు సురక్షితమైన ఔషధ కాంబినేషన్ ను ఇవ్వడంపై చీఫ్ సైంటిస్ట్ రవి శంకర్ నేతృత్వంలోని బృందం దానిపై ఇప్పటికే రీసెర్చ్ మొదలుపెట్టింది. వేర్వేరుగా పనితీరును కనబరిచే యాంటీ వైరల్ మందులను కలిపి వాడితే మెరుగైన ఫలితాలుంటాయని నిపుణులు వెల్లడించారు. అలాంటి రెండు కాంబినేషన్లపై తాము ప్రయోగాలు చేస్తున్నామని రవిశంకర్ తెలిపారు.
ఉమిఫెనోవిర్–మోల్నుపిరవిర్, ఉమిఫెనోవిర్–నిక్లోసమైడ్ (యాంటీ పారాసైటిక్) మందులతో ట్రీట్ మెంట్ చేయడంపై దృష్టి సారించామని తెలిపారు. మోల్నుపిరవిర్ తో దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండడంతో కేవలం అత్యవసర వినియోగానికే మన దేశంలో ఆమోదం లభించిందని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే మోల్నుపిరవిర్ కాంబినేషన్ లో దాని డోసేజ్ వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తున్నామని పేర్కొన్నారు. దానికి ఉమిఫెనోవిర్ ను కలపడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. కండరాల డ్యామేజీ, ఎముక కార్టిలేజ్ దెబ్బతినడం వంటి దుష్ప్రభావాలు రావని స్పష్టం చేశారు.
ఒకవేళ ఇది సక్సెస్ అయితే కరోనా చికిత్సలో ప్రభావవంతమైన ఔషధంగా ఉమిఫెనోవిర్ ఉపయోగపడుతుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు. కరోనా చికిత్సలో నిక్లోసమైడ్ ను వాడుతున్నా.. భారీ మోతాదులో తీసుకోవాల్సి ఉంటోందని, దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని రవిశంకర్ వెల్లడించారు.
మంచి ఫలితాలు రావాలంటే ఉమిఫెనోవిర్ తో కలిపి నిక్లోసమైడ్ ను పక్కాగా ఎంత మోతాదులో ఇవ్వాల్సి ఉంటుందన్నదానిపై రీసెర్చ్ చేస్తున్నామని చెప్పారు. కరోనాలోని అన్ని వేరియంట్లకూ ఒకే చికిత్సను అందించేందుకు వీలుగా ఔషధాలపై సీడీఆర్ ఐ టీం రాత్రింబవళ్లూ పనిచేస్తోందని సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ తపస్ కుందూ చెప్పారు.