సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, సాధ్వి నిరంజన్ జ్యోతి, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా పలువురు కీలక నాయకులు ఈ విడతలో పోటీ పడుతున్నారు.
మొత్తం 94,732 పోలింగ్ స్టేషన్లలో 8.95 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ 49 స్థానాల్లో 40 స్థానాలు ఎన్డీయే సిట్టింగ్ స్థానాలు కావడంతో బీజేపీకి ఈ దశ చాలా కీలకంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలకు సోమవారం పోలింగ్ జరుగుతుంది. ఇందులో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీ, స్మృతి ఇరానీ పోటీ చేస్తున్న అమేథీ, రాజ్‌నాథ్ సింగ్ పోటీ చేస్తున్న లక్నో స్థానాలు ఉన్నాయి.
కేంద్ర మంత్రులు కౌశల్ కిశోర్(మోహన్‌లాల్ గంజ్), సాధ్వి నిరంజన్ జ్యోతి(ఫతేహ్పూర్), భానుప్రతాప్ సింగ్ వర్మ(జలౌన్) కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ యూపీలో ఇప్పటికీ బలంగా కనిపిస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల్లో ఫలితాలపై అందరి ఆసక్తి నెలకొంది.
మహారాష్ట్రలోని 13 స్థానాలకు ఐదో దశలో పోలింగ్ జరగనుంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలోని పది స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్(ముంబై ఉత్తర), భారతి పవార్(దిండోరి), కపిల్ పాటిల్(భీవండి) బరిలో ఉన్నారు. మహారాష్ట్ర సీఎం షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే మరోసారి కల్యాణ్ నుంచి పోటీచేస్తున్నారు. శివసేన, ఎన్సీపీలో చీలక నేపథ్యంలో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి.
ఎన్డీయేకు గట్టి పోటీ ఎదురవుతున్న బీహార్‌లోని ముజఫర్‌పూర్, మధుబని, సీతామర్హి, సరన్, హజీపూర్ స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరగనుంది. హజీపూర్ నుంచి లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్, సరన్ నుంచి ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య, మాజీ కేంద్రమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడి బరిలో ఉన్నారు.
మరోవైపు జార్ఖండ్‌లోని గోండే శాసనసభ సీటుకు ఉప ఎన్నికకు సోమవారం పోలింగ్ జరుగనుంది. గోండే నుంచి మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ భార్య కల్పనా సొరేన్ పోటీ చేస్తున్నారు. ఒడిశాలోని అస్క, కంధమల్, బార్‌గర్హ్, బొలంగిర్, సుందర్‌గర్హ్ లోక్‌సభ స్థానాలకు 35 అసెంబ్లీ స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. సీఎం నవీన్ పట్నాయక్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు.