ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై మరో ఉచ్చు బిగిస్తున్నది. ఎఫ్సీఆర్ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ, పంజాబ్‌లలో అధికార పార్టీ ఆప్‌కు రూ.7 కోట్లకుపైగా విదేశీ నిధులు అందాయని ఈడీ ఆరోపించింది. ఈమేరకు కేంద్ర హోంశాఖకు సోమవారం లేఖ రాసింది. ఈ వ్యవహారంపై ఎఫ్సీఆర్ఏ, ప్రజా ప్రాతినిథ్యం చట్టం కింద విచారణ చేపట్టాలని ఈడీ కోరింది.
‘2015, 2016లలో అమెరికా, కెనడాలో నిధుల సేకరణ చేపట్టిన ఆప్‌కు రూ.7.08 కోట్లు విదేశీ నిధులు అందాయి. దీంట్లో విదేశీ దాతల గుర్తింపు, జాతీయతలను తారుమారు చేసింది. అలాగే ఇతర వివరాలు మార్చింది’ అని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.
కెనడాకు చెందిన కొంతమంది దాతల పేర్లను పార్టీ ఫైనాన్షియల్ రికార్డ్స్‌లో ఆప్ దాచిపెట్టిందని హోం శాఖకు ఈడీ తెలిపింది. ‘ఎఫ్సీఆర్ఏ ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల్ని సాధారణంగా సీబీఐ విచారిస్తుంది. ఆప్‌ను ఉద్దేశించి ఈడీ చేసిన ఆరోపణలపైనా కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టవచ్చు’ అని ఈడీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
ఈడీ ఆరోపణలపై ఆప్ నాయకురాలు ఆతిశీ స్పందించారు. ఆప్‌ను అప్రతిష్టపాల్జేసేందుకు ప్రధాని మోదీ చేసిన కుట్రగా ఆమె పేర్కొన్నారు. ఎప్పుడో 11 ఏండ్ల క్రితం నాటి కేసును తిరగతోడారని, ఇందులోని ఆరోపణలపై ఈడీ, సీబీఐ, కేంద్ర హోం శాఖ, ఎన్నికల కమిషన్‌కు అన్ని సమాధానాలూ పార్టీ తరఫున ఇచ్చామని ఆమె స్పష్టం చేశారు.
‘ఢిల్లీ, పంజాబ్‌లో మొత్తం 20 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఓడిపోనున్నది. అందువల్లే కేంద్ర దర్యాప్తు సంస్థల పేరుతో ఈ రాజకీయ కుట్రలకు బీజేపీ తెరలేపింది’ అని ఆమె ఆరోపించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసు, మలివాల్ కేసులు విఫలం కావటంతో, కొత్తగా ఈ కేసు ను (విదేశీ నిధులు) బీజేపీ తెరపైకి తీసుకొచ్చిందని ఆమె విమర్శించారు.