నూతనంగా సవరించిన వేతనాల పట్ల ఉద్యోగుల నిరసనలను, సమ్మె హెచ్చరికలను పట్టించుకోకుండా అమలుకు ప్రయత్నిస్తున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంకు ఉద్యోగుల నుండి తిరస్కారం ఎదురవుతున్నది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడానికి ట్రెజరీ ఉద్యోగులు ఇప్పటికే తిరస్కరించగా, తాజాగా పే అండ్ అక్కౌంట్స్ సిబ్బంది కూడా అడ్డం తిరిగారు. ఆ పనిచేసేది లేదని స్పష్టం చేశారు.
జీతాల బిల్లులు తయారు చేసి, చెల్లింపులు చేయడానికి ట్రెజరీ ఉద్యోగులు తిరస్కరించడంతో, ఆ బాధ్యతను పే అండ్ అక్కౌంట్స్ సిబ్బందికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆ శాఖ ఉద్యోగులు భగ్గుమన్నారు. కొత్త పిఆర్సిని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తుంటే, ఆ ఉత్తర్వుల అమలుకు కసరత్తు చేయాలనితమను ఆదేశించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయలేమని స్పష్టం చేశారు.. ఈ మేరకుపే అండ్ ఎకౌంట్స్ ఆఫీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం వెంకటేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి పి శివ ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త పిఆర్సిని వ్యతిరేకిస్తూ ఎపిఎన్జిఓ, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు చేపట్టిన ఆందోళనలో తాము కూడా భాగస్వాములుగా ఉన్నామని వారు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో హడావుడిగా బిల్లులను ప్రోసెస్ చేయాలంటూ తమపై ఒత్తిడి చేయడం తగదని పేర్కొన్నారు. దీంతో ఏం చేయాలో తోచనిస్థితి ప్రభుత్వంలో నెలకొంది. జీతాల బిల్లులను రూపొందించలేమని ట్రెజరీ ఉద్యోగులు స్పష్టం చేయడంతో, ఆ బాధ్యతను పే అండ్ ఎకౌంట్స్ ఆఫీసర్‌కు(పిఎఓ) అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఆర్థికశాఖ నుండి పిఎఓకు ఉత్తర్వులు అందాయి.
ఆదేశాల్లో పేర్కొన్నట్టుగా పిఎఓ కసరత్తు కూడా ప్రారంభించారు. డిడిఓలకు మార్గదర్శకాలను జారీ చేశారు. డిడిఓల అనుమానాలను నివృత్తి చేసేందుకు పిఎఓ కార్యాలయంలో ఐదుగురు లైజనింగ్ అధికారులను కూడా నియమిస్తూ సర్క్యులర్‌ను జారీ చేశారు. కొత్త బిల్లులకు ఆర్పిఎస్ – 2015 ప్రకారం ఉద్యోగుల సర్వీసు రికార్డులను (ఎస్ఆర్) రిఫరెన్స్‌కు తీసుకోవాలని సూచించారు.
2018 జూలై ఒకటి నుంచి 2021 డిసెంబర్ 31 వరకు ఉద్యోగులు డ్రా చేసిన జీతాలను పరిశీలించాలని తెలిపారు. అనంతరం 2021 డిసెంబర్ నాటికి వారి ఎంప్లాయీస్ డేటాను అప్డేట్ చేయాలని సూచించారు. డిడిఓలు ఇ సిగ్చేచర్ను సబ్మిట్ చేసిన తర్వాత పిఎఓ వాటిని ధృవీకరిస్తే, కొత్త పిఆర్సి ప్రకారం పే ఫిక్సేషన్ స్లిప్‌లు జనరేట్ అవుతాయని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.