2024 ఆర్థిక సంవత్సరంలో నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) 62 శాతం క్షీణించి 10.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బిఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది అంతకుముందు సంవత్సరంలో 27.98 బిలియన్ డాలర్లుగా వుంది. 2007 తర్వాత దేశంలోకి వచ్చిన నికర ఎఫ్‌డిఐల్లో ఇదే అత్యల్పం.
2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 71.0 బిలియన్ డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నాయని ఆర్బిఐ తాత్కాలిక గణాంకాలు వెల్లడించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో ఎఫ్‌డిఐలు 26.55 బిలియన్ డాలర్లు, ఔట్ ఫ్లోలు 15.96 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి.
అయితే, 2023 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీఐల ప్రవాహం 42.0 బిలియన్ డాలర్లు కాగా, ఔట్ ఫ్లోలు 14.02 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అదేసమయంలో భారత్‌లో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టిన వారి పెట్టుబడుల ఉపసంహరణ గతేడాది 29.34 బిలియన్ డాలర్ల నుంచి ఈ ఏడాదికి 44.40 బిలియన్ డాలర్లకు పెరిగింది.
ఈ నెలలో ఆర్బిఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఎఫ్‌డిఐ ఈక్విటీ ప్రవాహాలలో 60 శాతానికి పైగా తయారీ, విద్యుత్, ఇంధనం, కంప్యూటర్, ఆర్థిక సేవలు, రిటైల్ మరియు హౌల్‌సేల్ వాణిజ్యం వైపు మళ్లించబడ్డాయి. దీనిలో సింగపూర్, మారిషస్, అమెరికా, నెదర్లాండ్స్, జపాన్, యూఏఈల వాటా 80 శాతానికి పైగా ఉంది. 2023-24లో నికర ఎఫ్‌డిఐలు 28.0 బిలియన్ డాలర్ల నుంచి 10.6 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
ఇటీవల అధిక రుణ వ్యయాలు, లోతైన భౌగోళిక విభజన, పెరుగుతున్న రక్షణవాదం వంటి అనేక అంశాలు ప్రపంచ ఎఫ్‌డిఐ లపై ప్రభావం చూపాయి. ఏదేమైనా, 2024లో అధిక ఎఫ్‌డిఐ వేగాన్ని అందిపుచ్చుకునే మొదటి పది ఆర్థికవ్యవస్థలలో భారతదేశం ఒకటి అని ఎఫ్‌డిఐ ఇంటెలిజెన్స్‌ను ఉటంకిస్తూ ”స్టేట్ ఆఫ్ ఎకానమీ” పేర్కొంది.
కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, ప్రపంచ పెట్టుబడి విధానాలలో నిర్మాణాత్మక మార్పు వచ్చింది, అభివద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల నుండి అభివద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల వైపు ఎఫ్‌డిఐ పెట్టుబడులను మార్చింది. 2003లో 8.2 శాతంగా ఉన్న ప్రపంచ ఎఫ్‌డీఐ మూలధన వ్యయం వాటా 2023లో 14.9 శాతానికి పెరిగింది. భారతీయ కంపెనీలు విదేశాల్లో 550కి పైగా గ్రీన్‌ఫీల్డ్ ఎఫ్‌డీఐ ప్రాజెక్టులను ప్రకటించాయని ఆర్బిఐ నివేదిక తెలిపింది.