బిల్డర్ తన వద్ద ఫ్లాట్లను కొనేవారికి కలలను అమ్మినపుడు, ఆ కలలు సాకారమయ్యే విధంగా సదుపాయాలను కల్పించడంలో విఫలమైతే, వారు పెట్టిన పెట్టుబడిని వడ్డీతో సహా తిరిగి రాబట్టుకునే హక్కు వారికి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్డర్ ఐఆర్ఇఓ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన అపీలుపై ఈ తీర్పు చెప్పింది.
గురుగ్రామ్‌లో గోల్ఫ్ కోర్స్ ఎక్స్టెన్షన్ రోడ్డులో స్కీఒన్ ప్రాజెక్టును ఐఆర్ఇఓ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తోంది. ఇటాలియన్ మార్బుల్ ఫ్లోర్, గోల్ఫ్ కోర్స్ వ్యూ, ఇతర విలాసవంతమైన సదుపాయాలతో కూడిన ఫ్లాట్‌ను అమ్ముతానని బ్రోచర్లో హామీ ఇచ్చింది. దీనిని నమ్మిన ఫ్లాట్ కొనుగోలుదారులు ఒక్కొక్కరు రూ.2 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టారు.
హామీ ఇచ్చిన సదుపాయాలేవీ కల్పించకపోవడంతో తమ సొమ్ము తమకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఐఆర్ఇఓ స్పందిస్తూ 20 శాతం సొమ్మును తగ్గిస్తామని బెదిరించింది. వెంటనే ఫ్లాట్ బయ్యర్లు జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ)ని ఆశ్రయించారు. విచారణ జరిపిన ఎన్సీడీఆర్సీ తీర్పు చెప్తూ, హర్యానా ఐఆర్ఇఓ ప్రకారం అసలు సొమ్మును 10.5 శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది.
ఈ తీర్పును ఐఆర్ఇఓ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బేల ఎం త్రివేది ధర్మాసనం విచారణ జరిపింది. హామీ ఇచ్చినట్లుగా గోల్ఫ్ కోర్స్ వ్యూ ఉందా? అని అపీలుదారు తరపు న్యాయవాదిని ధర్మాసనం అడిగింది. అందుకు ఆ న్యాయవాది అంకుర్ సెహగల్ బదులిస్తూ, బిల్డర్ హరిత హారాన్ని ఏర్పాటు చేశారని, గోల్ఫ్ కోర్స్ లేదని చెప్పారు.
ఫ్లాట్ బయ్యర్లు అలోక్ ఆనంద్, నితిన్ జునేజా తమ ఫిర్యాదుల ద్వారా అనేక అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. బ్రోచర్లో హామీ ఇచ్చిన, అపార్ట్మెంట్ బయ్యర్స్ అగ్రిమెంట్లో పేర్కొన్నవాటిలో అనేక సదుపాయాలను కల్పించడంలో ఐఆర్ఇఓ విఫలమైందని తెలిపారు. అత్యాధునిక, హై ఎఫిషియెన్సీ, టెక్నాలజీ డ్రైవన్ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
స్మార్ట్ హోం ఆటోమేషన్, హైస్పీడ్ ఎలివేటర్స్, స్వీపింగ్ బాల్కనీస్, విఆర్ఎఫ్టి ఎయిర్కం డిషనింగ్ టెక్నాలజీ, వరల్డ్ క్లాస్ క్లబ్, భారీ రిక్రియేషనల్, స్పోర్ట్స్ ఆప్షన్స్ వంటివాటిని హామీ ఇచ్చారన్నారు. చదరపు అడుగుకు రూ.11,600 చొప్పున ప్రీమియం చెల్లించామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సమీపంలోని ఇతర బిల్డర్లు చదరపు అడుగుకు రూ.6,500 చొప్పున మాత్రమే వసూలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ హామీలను బిల్డర్ తుంగలో తొక్కారని, మరీ ముఖ్యంగా గోల్ఫ్ కోర్స్ లేదని చెప్పారు.
దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, బిల్డర్ కలల ఇంటిని ఫ్లాట్ బయ్యర్లకు అమ్ముతారని, కానీ సదుపాయాలు మాత్రం కల్పించరని వ్యాఖ్యానించింది. హామీ ఇచ్చిన సదుపాయాలను కల్పించకపోతే, పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వడ్డీతో సహా తిరిగి పొందేందుకు అర్హులేనని, వారికి ఆ హక్కు ఉందని తెలిపింది. హామీలను నెరవేర్చనందున ఫ్లాట్ బయ్యర్లకు 10.5 శాతం వడ్డీతో సహా వారు పెట్టిన పెట్టుబడిని తిరిగి వారికి చెల్లించాలని ఐఆర్ఇఓ ను ఆదేశించింది. ఎన్సీడీఆర్సీ తీర్పును సమర్థించింది.