నేతాజీ 125వ జయంతి
డా. టి ఇంద్రసేనారెడ్డి
సుమారు వేయేళ్లు వలస పాలనాలలో ఆర్ధికంగా, సాంస్కృతికంగా తీవ్రమైన దోపిడీకి గురైన భారతదేశం ప్రపంచ దేశాలలో అస్తిత్వమే కోల్పోయే పరిస్థితులు నెలకొన్న సమయంలో, భారత్ ను ఒక జాతిగా మనుగడ సాగించే పరిస్థితులు లేవని భారతీయులు కూడా ఆత్మనూన్యతా భావనలో మ్రగ్గుతున్న సమయంలో ఇద్దరు మహా పురుషులు ప్రపంచ దేశాలలో అజేయమైన భారత పౌరుషాన్ని ప్రదర్శించారు. తద్వారా భారతీయులు సగర్వంగా ఆత్మవిశ్వాసంతో తలయెత్తుకొని తిరిగే విధంగా చేయగలిగారు.
వారిలో మొదటివారు స్వామి వివేకానంద. చికాగోలోని ప్రపంచ మతాల సదస్సుకు హాజరై, భారతీయ తాత్విక ఆలోచనలు ఎంతటి మహోన్నతమైనవో మొత్తం ప్రపంచంకు తెలియచేయ గలిగారు. భారత దేశ వ్యాప్తంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా పర్యటనలు జరిపి భారతీయ ఔనత్యంకు ప్రపంచం నీరాజనాలు పలికేవిధంగా చేయాలిగారు.
ఎవ్వరి ఒక విదేశీ మ్రగ్గడం కాకుండా స్వరాజ్యం అనే ఆలోచనలు మరచిపోయిన భారత జాతిని స్వాతంత్య్రం కోసం సమాయత్తం చేయగలిగారు. మరణించే ముందు 50 సంవత్సరాలకు భారత్ స్వాతంత్య్రం పొందుతుందని ఆయన ముందే ఒక మార్గనిర్ధేశం చేశారు.
వివేకానందుడి బోధనల నుండి స్ఫూర్తి పొంది, భారత దేశాన్ని బానిస సంకెళ్ళ నుండి విముక్తి కావించడం కోసం కలలోకూడా ఎవ్వరు ఊహించని అద్భుతమైన సహస, పరాక్రమాలను ప్రదర్శించి, దేశ స్వాతంత్య్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిన యోధుడు సుభోష్ చంద్రబోస్, `నేతాజీ’ అని భారతీయులే కాకుండా మొత్తం ప్రపంచం గుర్తుంచుకొంటున్న ఆయన కేవలం భారతీయులలోనే కాకుండా మొత్తం ప్రపంచంలోనే స్వతంత్ర ఆకాంక్షలను కలుగచేసారు.
ఆయన 125వ జయంతి సందర్భంగా ఇక నుండి ప్రతి సంవత్సరం ఆయన జయంతిని `పరాక్రమ్ దివాస్’ గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించడం ఆయనకు నిజమైన నివాళి కాగలదు. కేవలం ఆయన కారణంగానే భారతీయులు బానిసత్వంలో మగ్గడానికే తగిన వారనే దురభిప్రాయాన్ని ప్రపంచ ప్రజలు పోగొట్టుకొని, వారు పంజా విప్పితే ఎంతవారికైనా ఎదురు నిలబడటం కష్టం కాగలదని తెలుసుకొనేటట్లు చేశారు.
ఆయన ఒక రాజ్యాధిపతి కాదు. ఆయన చేతిలో సైన్యం లేదు. కనీసం అపారమైన ఆర్ధిక, ఇతరత్రా వనరులు కూడా లేవు. బ్రిటీష్ పోలీసుల, గూఢచారుల కండ్లుగప్పి, రెండు ప్రపంచ యుద్ధ మేఘాలు భయంకరంగా ఆవరించిన సమయంలో, అంతంత మాత్రంగా ఉన్న ఆరోగ్యంతో జనవరి 16, 1941న కలకత్తా నుంచి ఒంటరిగా బయలుదేరిన ఆయన నూతన చరిత్రను సృష్టించారు.
ఒంటరిగా నాటి ప్రపంచంలో బలవంతులుగా భావించే దేశాధినేతలు కలిశారు. వారితో ఒక దేశాధినేతకు ఇచ్చే గౌరవం పొందారు. `శత్రువు శత్రువు మిత్రుడు’ అనే చాణిక్య యుద్ధ నీతిని పాటిస్తూ, బ్రిటిష్ వారిని దేశం నుండి వెళ్లగొట్టడానికి ఇదే సమయమని భావించే తానే ఒక మాసైన్యంగా వ్యవహరించారు.
నాటి యుద్ధ వాతావరణంలో సాధారణ ప్రజానీకం రోడ్లపై సంచరించడానికి కూడా భయపడే పరిస్థితులలో నెలల తరబడి సముద్రంలో కూడా, తగు రక్షణ లేకుండానే సాహసయాత్ర జరిపి, రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన విజయగర్వంతో ఉన్న బ్రిటిష్ పాలకుల గుండెల్లో అగ్ని రగిల్చారు. బ్రిటిష్ వలస పాలకులను యుద్ధ భూమిలో సవాల్ చేసిన ఏకైక జాతీయ నాయకుడు నేతాజీ కావడం గమనార్హం.
ప్రవాసంలో జాతీయ ప్రభుత్వాన్ని ప్రకటించారు. నవంబర్లో అండమాన్, నికోబార్ దీవులలోని భారత్ భూభాగంలోకి ప్రవేశించే తన జాతీయ ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆయన భారత్ భూభాగంలోకి ప్రవేశించి అక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అక్కడ గల భారత సైన్యం, ప్రజలు ఆయనను భారత దేశ ప్రధానిగా స్వాగతం పలికి, గౌరవించారు.
మొత్తం ప్రపంచ చరిత్రలో ఏకాకిగా బయలుదేరిన ఒక వ్యక్తి, ఇంతటి అసాధారణమైన సహస పరాక్రమాలు ప్రదర్శించి, ప్రపంచ విజేతగా ఉన్న దేశాన్ని వణికించిన సందర్భం మరొకటి లేదని చెప్పవచ్చు. నేతాజీ మే, 1941లో దేశం వదిలితే ఆగష్టు, 1945లో తైపీ నుంచి బయలుదేరిన ఆయన విమానం కూలిపోయింది. ఆ తర్వాత ఆయన గురించిన నిర్దుష్టమైన ఆచూకీ లేదు.
అంటే కేవలం నాలుగేళ్ల కాలంలో ఆయన ప్రదర్శించిన సహస పరాక్రమాలు కేవలం భారత దేశం స్వాతంత్య్రం పొందడానికే కాకుండా మొత్తం ఆసియా, పసిఫిక్ ఖండాలలో సుమారు 60 దేశాలు వలస సంకెళ్లను తెంచుకొని స్వతంత్ర దేశాలుగా అవతరించడానికి స్ఫూర్తి కలిగించారు. అందుకనే ఆయనను `ప్రపంచ స్వతంత్ర సమరయోధుడు’గా ఇప్పటికే అనేక దేశాలలో గౌరవిస్తున్నారు.
1857లో బ్రిటిష్ వారు `సిపాయిల తిరుగుబాటు’గా చిత్రీకరించిన `మొదటి స్వతంత్ర సంగ్రామం’లో వారి అణచివేత, వివక్షతలకు తగ్గుకోలేక మన సైనికులు తిరుగుబాటు జరిపారు. కానీ బ్రిటిష్ వారిని దేశం నుండి పంపివేసి, స్వరాజ్యం ఏర్పాటు చేసుకోవాలనే బలమైన ఆకాంక్షను మొదటగా `స్వరాజ్యం నా జన్మహక్కు’ అంటూ స్వతంత్ర సంగ్రామంలో బాలగంగాధర తిలక్ వ్యక్తం చేయగా, ఆయన ఆకాంక్షకు కార్యరూపం దాల్చే ప్రయత్నాన్ని నేతాజీ జరిపారు.
అంతకు ముందు రెండు దశాబ్దాల పాటు భారత దేశంలో స్వతంత్ర పోరాటంలో క్రియాశీల పాత్ర వహించారు. కాంగ్రెస్ కు వరుసగా రెండు సార్లు అధ్యక్షునిగా ఎన్నికై, బ్రిటిష్ వారికి పిటీషనలు పెట్టుకొనే స్థాయినుండి, వారిపై పోరాటంకు దేశ ప్రాయాలను సమాయత్తం చేసే విధంగా దానిని ఒక బలమైన సాధనంగా మార్చే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నంలో పలువురు అగ్రనాయకులు సహాయ నిరాకరణ చేస్తుండడంతో విరక్తి చెంది, తనదైన పంథాను ఎంచుకున్నారు.
సుభాష్ చంద్రబోస్ జీవితమే పోరాటాల మయం. అందుకనే యువతకు నేటికీ కూడా ఆయన పేరు చెబితే పులకింతులవుతారు. ఉత్తేజం పొందుతారు. నేతాజీ పిలుపుతో వేలాది మంది తమ ప్రాణాలను అర్పించారు.ఆయన దార్శనికత, వ్యక్తిత్వం, ధృడ సంకల్పం, అసమాన ధైర్యం భవిష్యత్ తరాలకు సహితం ఉత్తేజం కలిగిస్తుంది.
అందుకనే మరే జాతీయ నాయకుడికి లేని ప్రజాదరణ పొందారు. భారత మాత అంటే గల విశేష అభిమానంతో తన దేశం బానిసత్వపు సంకెళ్లతో బంధించి ఉండగా ప్రశాంతంగా జీవించ లేకపోయారు. ఆయన పట్టుదల ఆయనకు విదేశాలలో సహితం దేశాధినేతలు, ఇతర ప్రముఖుల నుండి మద్దతు లభించేటట్లు చేసింది. కేవలం మనోసంకల్పంతో ఒక బలగాన్ని నిర్మించి, బ్రిటిష్ పాలకులపై యుద్ధం ప్రకటించారు.
ఆ బలగం ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ). `చలో ఢిల్లీ’ అనే నినాదంతో ముందుకు సాగారు. దేశం కోసం వేలాది మంది సైనికులు ప్రాణాలను అర్పించారు. “విజయం ఎల్లప్పుడూ వైఫల్యాల స్తంభంపై నిలుస్తుంది” అనే నానుడిని బలంగా నమ్మిన ఆయనను ఎటువంటి వైఫల్యాలు కూడా నిరుత్సాహ ప్రచలేక పోయాయి. అదే సంకల్పంతో ఇతరులకు స్ఫూర్తి కలిగించ గలిగారు. ఇప్పటికి కలిగిస్తూనే ఉన్నారు.