అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, సిక్కిం క్రాంతి కారీ మోర్చా (ఎస్కేఎమ్) మారోసారి ఘనవిజయం సాధించి ప్రభుత్వాలు ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ మొత్తం 60 స్థానాల్లో 46 సీట్లలో విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్ దాటింది. దీంతో అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో పార్టీ శ్రేణులు ఈటానగర్‌తో సహా పలు ప్రాంతాల్లో సంబరాలు జరుపుకుంటున్నారు.
ఏప్రిల్ 19న మొదటి దశ లోక్‌సభ ఎన్నికలతో పాటు 50 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. వారిలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ ఉన్నారు. మొత్తం 50 స్థానాల్లో బీజేపీ 36 స్థానాల్లో విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
నేనషల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీఈపీ) ఐదు స్థానాల్లో గెలుపొందింది. ఎన్సీపీ మూడు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) రెండు, కాంగ్రెస్ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు జూన్ 4నే వెలువడనున్నట్లు ఎన్నికల సంఘం తొలుత ప్రకటించింది. కానీ ఆదివారంతో రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుండటం వల్ల కౌంటింగ్‌ను రెండు రోజుల ముందు ఏర్పాటు చేసింది.
సిక్కింలో ప్రేమ్ సింగ్ తమాంగ్ నేతృత్వంలోని ఎస్‌కేెఎమ్, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లను సొంతం చేసుకుంది. మొత్తం 32 స్థానాల్లో 31 సీట్లలో విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్ 17ను దాటింది. రెనాక్ స్థానం నుంచి ప్రేమ్ సింగ్ తమాంగ్ 7000 ఓట్లకు పైగా తేడాతో గెలుపొందారు. తాను పోటీ చేసిన మరో నియోజకవర్గం సోరెంగ్ చకుంగ్లోనూ తమాంగ్ విజయం సాధించారు. మరోవైపు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి, డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డిఎఫ్) అధినేత పవన్ కుమార్ చామ్లింగ్ పోటీచేసిన రెండు చోట్ల కూడా ఓడిపోయారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్డీఎఫ్, ఎస్కేఎమ్ హోరాహోరీగా తలపడ్డాయి. ఎస్డీఎఫ్ 47.63 శాతం ఓట్లు సాధించి 15 సీట్లు గెలవగా, ఎస్డీఎఫ్ 47.03 శాతం ఓట్లు సాధించి 17 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు హమ్రో సిక్కిం పార్టీ, సిక్కిం రాజ్య మంచ్, సిక్కిం యునైటెడ్ ఫ్రంట్, జై మహా భారత్ పార్టీ ఖాతా తెరువలేకపోయాయి.