పిఆర్సిపై వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ఘర్షణ తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై సమ్మె నోటిస్ ఇవ్వడానికి సిద్ధమైన ఉద్యోగ సంఘాల నాయకులను చర్చించేందుకు రావాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ కోరింది. అయితే జివోను రద్దు చేసే వరకూ తాము చర్చలకు రాబోమని నాయకులు తేల్చిచెప్పారు.
అలాగే నేడు సమ్మెకు సంబంధించిన నోటీసు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీనిపై శుక్రవారమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అపాయింట్మెంట్ కోరారు. సమ్మె నోటీసుతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆదివారం సాయంత్రం విజయవాడ ఎన్జిఓ హోమ్‌లో నాయకులు సమావేశమయ్యారు.
మంత్రుల కమిటీతో చర్చలు జరపాలని సాధారణ పరిపాలనాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్ నాయకులకు సమాచారం ఇవ్వగా జివోలు రద్దు చేసే వరకూ తాము చర్చలకు రాబోమని నాయకులు తేల్చిచెప్పారు. అన్ని జిల్లాల్లో ఆందోళనా కార్యక్రమాలు విజయవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రతి జిల్లాకు జెఎసి తరుపున రాష్ట్రస్థాయి నాయకుడిని పంపాలని నిర్ణయించారు.
అన్ని జిల్లాల్లోనూ పిడిఎఫ్ ఎమ్మెల్సీలను కలుపుకుపోవాలని నిర్ణయించారు. అయితే ఉద్యోగ సంఘాలతో చర్చలకు కమిటీ ఏర్పాటు చేసినట్లు తమకు సమాచారం లేదని సమావేశం అనంతరం నాయకులు మీడియాకు తెలిపారు. కమిటీ విధివిధానాలు ఏమిటి, చట్టబద్ధత ఏమిటో తెలియకుండా చర్చలకు ఎలా వెళతామని ప్రశ్నించారు. ముందు జివోలు రద్దు చేయాలని కోరారు.
అలాగే ఈ నెల కూడా పాత జీతాలే ఇవ్వాలని, అశుతోష్‌మిశ్రా కమిటీ నివేదికను బయటపెట్టాలని వారు కోరారు. సోమవారం మధ్యాహ్నం మూడుగంటలకు సిఎస్‌కు సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు. అయితే నిరసన తెలిపే కార్యక్రమం అవడం వల్ల రాజకీయ పార్టీలను పిలవకూడదని నిర్ణయించామని పేర్కొన్నారు.
కొత్త పిఆర్సిని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో జనవరి నెల జీతాలను కొత్త పే స్కేళ్ల ప్రకారమే చెల్లించాలని ఆర్థికశాఖ మరోసారి పునరుద్ఘాటించింది. 11వ పిఆర్సి ప్రకారం జీతాల బిల్లులను తయారు చేసేందుకు ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ (పిఎఓ), సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సిఎఫ్ఎంఎస్) అధికారులకు ఆర్థికశాఖ మరోసారి ఆదేశాలను జారీ చేసింది.
కొత్త పిఆర్సికి వ్యతిరేకంగా పిఆర్సి సాధన సమితి ఆధ్వర్యంలో ఇప్పటికే ఉద్యమం ప్రారంభమైంది. అందులో భాగంగా అన్ని జిల్లాల్లోనూ ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి.
సమ్మె నోటీసు ఇచ్చేందుకు సమితి నేతలు సిద్ధమవుతున్న తరుణంలో కొత్త పే స్కేళ్ల ప్రకారమే జీతాల బిల్లులను ఈ నెల 25వ తేదీలోగా తయారు చేయాలంటూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.