పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కోసం పని చేసిన బ్రహ్మోస్ మాజీ ఇంజినీర్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. కీలకమైన సాంకేతిక సమాచారాన్ని లీక్ చేసిన ఆరోపణల కేసులో 14 ఏళ్లు కఠిన కారాగార శిక్షతోపాటు రూ.3,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.
మహారాష్ట్ర నాగపూర్‌లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఇంజినీర్‌గా నిశాంత్ అగర్వాల్ గతంలో పని చేశాడు.
బ్రహ్మోస్ కేంద్రంలో నాలుగేళ్లు విధులు నిర్వహించాడు. పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కు కీలకమైన సాంకేతిక సమాచారాన్ని అతడు లీక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2018లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ (ఏటీఎస్) సంయుక్త ఆపరేషన్‌లో అతడ్ని అరెస్టు చేశారు.
కాగా, అధికారిక రహస్యాల చట్టం, ఐటీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద నమోదైన కేసులో నిశాంత్ అగర్వాల్‌ను దోషిగా నాగపూర్ జిల్లా కోర్టు నిర్ధారించింది. 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 3,000 జరిమానా విధిస్తూ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎంవీ దేశ్‌పాండే సోమవారం తీర్పు ఇచ్చారు. అయితే గత ఏడాది ఏప్రిల్‌లో బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ నిశాంత్ అగర్వాల్‌కు బెయిల్ మంజూరు చేసింది.