ఒడిశాలో బిజూ జనతా దళ్ కోటను బద్దలుకొట్టింది బీజేపీ. వరుసగా ఆరు సార్లు అధికారం చేపట్టిన బీజేడీకి చెక్ పెడుతూ కమలం పార్టీ విజయ దుందుభి మోగించింది. దీంతో ఏడోసారి అధికారం చేపట్టి ఒక రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా పనిచేసి రికార్డు సృష్టించాలనుకున్న ఆయన కలలపై కమలం పార్టీ నీళ్లు చల్లింది.
నిజానికి, మొదట కూటమిగా వెళ్లాలనుకున్న ఇరు పార్టీలు సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరక విడివిడిగా పోటీ చేశాయి. ఇన్నాళ్లు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేడీ అదే పార్టీ చేతిలో ఓటమి పాలైంది. 147 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఒడిశాలో బీజేపీ 78 స్థానాల్లో విజయం సాధించింది. బీజేడీ 51 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ 14 చోట్ల, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు.
మరోవైపు లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేడీ చతికిలపడింది. 21 స్థానాల్లో బీజేపీ 20 సీట్లలో ఘన విజయం సాధించగా, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అత్యధిక కాలం సీఎంగా చేసి రికార్డు సృష్టించే అవకాశాన్ని నవీన్ పట్నాయక్ కోల్పోయారు. నవీన్ పట్నాయక్ 2000 మార్చిలో తొలిసారి సీఎం అయిన నాటి నుంచి ఇప్పటి వరకు సీఎంగా కొనసాగుతున్నారు.
ఆయన ముఖ్యమంత్రిగా 24 ఏండ్ల 90 రోజులకు పైగా పనిచేశారు. మరోసారి గెలిచి, అధికార పీఠం ఎక్కి ఉంటే.. అత్యధిక కాలం సీఎంగా చేసిన వారిలో సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును పట్నాయక్ దాటేసేవారు. చామ్లింగ్ ఆ రాష్ర్టానికి 24 ఏండ్ల 165 రోజులు సీఎంగా విధులు నిర్వర్తించారు.
దీర్ఘకాలం సీఎంగా చేసిన వారిలో చామ్లింగ్, నవీన్ పట్నాయక్ తర్వాతి వరుసలో జ్యోతిబసు (పశ్చిమబెంగాల్-23 ఏండ్ల 137 రోజులు), గెగాంగ్ అపాంగ్ (అరుణాచల్‌ప్రదేశ్-22 ఏండ్ల 250 రోజులు), లాల్ థధ్వాల్(మిజోరం- 22 ఏండ్ల 60 రోజులు), వీరభద్రసింగ్ (హిమాచల్‌ప్రదేశ్- 21 ఏండ్ల 13 రోజులు) ఉన్నారు.