లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి రాహుల్ గాంధీ అంగీకరించవచ్చని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారని వెల్లడించారు.
శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) విస్తృత సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని నియమించాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది.
కాగా, సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత కావాలని కాంగ్రెస్ నేతలంతా గట్టిగా కోరుతున్నారని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇది వర్కింగ్ కమిటీ అభ్యర్థన అని చెప్పారు.
తమ ప్రతిపాదనపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని రాహుల్‌గాంధీ చెప్పారని ఆయన తెలిపారు. సాధ్యమైనంత త్వరలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారని అన్నారు. రెండు చోట్ల గెలిచిన రాహుల్‌గాంధీ ఏ స్థానానికి రాజీనామా చేస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వాయనాడ్ నుంచి గెలిచిన రాహుల్‌గాంధీ రెండింట్లో ఏదో ఒక స్థానాన్ని వదులుకునేందుకు ఈ నెల 15 వరకు గడువు ఉన్నదని, కానీ ఈ మూడు నాలుగు రోజుల్లో ఆయన నిర్ణయం తీసుకుంటారని కేసీ వేణుగోపాల్ చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వాయనాడ్‌ల నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో చేసిన కృషిని కూడా సీడబ్ల్యూసీ తీర్మానం కొనియాడిందని తెలిపారు. సుమారు మూడు గంటల పాటు ఈ సమావేశం సాగింది. సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు.
సిడబ్ల్యూసీ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై, ఎన్నికల ఫలితాలపై చర్చించామని చెప్పారు. సీబీఐ, ఈడీ సంస్థలతో కాంగ్రెస్ నేతలను బ్లాక్మెయిల్ చేశారని, అయినా పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని చెప్పారు. కాంగ్రెస్ పని అయిపోయిందని చాలా మంది కామెంట్స్ చేశారని.. ఎగ్జిట్ పోల్స్‌పై పోరాటం చేశామని కేసీ వేణుగోపాల్ చెప్పుకొచ్చారు.