2014 లోక్సభ ఎన్నికలలో ఒక సీట్ కూడా గెలుపొందలేని బహుజన సమాజ్ పార్టీ, 2019 ఎన్నికలలో అనూహ్యంగా నరేంద్ర మోదీ ప్రభంజనంలో కూడా 10 సీట్లు గెల్చుకొని, తిరిగి రాష్ట్ర రాజకీయాలలో నిర్ణయాత్మక శక్తిగా మాయావతి ఎదుగుతున్నట్లు సంకేతం ఇచ్చాయి. అయితే ఈ విజయానికి సమాజ్ వాద్ పార్టీతో పొత్తు ఏర్పరచుకోవడం ఒక ప్రధాన కారణం కావచ్చు.
అయితే అప్పటి నుండి ఆమె రాష్ట్ర రాజకీయ చిత్రం నుండి క్రమంగా కనుమరుగవుతున్నారు. మీడియా, సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకోసం చిన్న, చితక పార్టీలు సహితం గత ఆరు నెలలుగా హడావుడి చేస్తుంటే ఆమె శిబిరం ఒక విధంగా మౌనంగా ఉంటూ వచ్చింది. ఆమె బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అందుకు కరోనా మహమ్మారి మాత్రమే కాకుండా ఆమె ఆరోగ్యం కూడా సహకరించడం లేదని చెబుతున్నారు.
మరోవంక, ఆమె ఓట్ల ప్రాతిపదిక కుంచించుకు పొత్తు రావడం మరో ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. ఆమెకు మద్దతుగా ఉంటూ వస్తున్న సామజిక వర్గాలలో చీలిక ఏర్పడిన సంకేతాలు వెలువడుతున్నాయి. వాస్తవానికి 2019లో బీఎస్పీ- ఎస్పీ పొత్తులో ఆమెకన్నా ఎస్పీ ఎక్కువగా నష్టపోయింది. అయితే ఆమె ఏకపక్షంగా ఆ పొత్తును తెంచుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆమె బిజెపి వత్తిడులకు గురవుతున్నారనే సంకేతాలు ఆమె మద్దతు దారులకు వెళ్లాయి.
లోక్సభ ఎన్నికల నాటి నుంచి మాయావతి రాజకీయంగా నిస్సత్తువగా కనిపిస్తున్నారు. 403 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో ఆమె పార్టీకి చెందిన 19 మంది సభ్యులలో 13 మంది సమాజ్వాదీ పార్టీలోకి వెళ్లిన సమయంలో ఆమె నిస్సహాయంగా మిగిలిపోయారు. ఆమె పార్టీకి చెందిన చాలామంది సీనియర్ నేతలు, చివరకు ఆమెకు నమ్మకస్తులైన నేతలు సహితం వివిధ పార్టీలకు మారారు.
బీఎస్పీకి మొదటి నుండి రాజకీయ ఫిరాయింపులు కొత్త కాదు. అయితే తనకున్న కొన్ని సామజిక వర్గాల మద్దతుతో అటువంటి ఫిరాయింపులను లెక్కచేయకుండా ఆమె రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అయితే గత రెండేళ్లుగా ఆమెలో ఆ చురుకుతనం కనిపించడం లేదు. అయితే, రాష్ట్రంలో పలు చోట్ల దళితులపై దాడుల సంఘటనలు జరుగుతున్నా ఆమె ప్రకటనలకే పరిమితం అవుతున్నారు.
గత మూడు దశాబ్దాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉధృతంగా రాజకీయ పోరాటాలు జరిపిన ఆమె ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దాదాపు దూరమైన్నట్లు కనిపిస్తున్నది. దానితో ఆమె మద్దతుదారులు సహితం ఆమెకు క్రమంగా దూరం అవుతున్నారు. క్షేత్రస్థాయిలో దళిత్ కార్యకర్తలతో ఆమెకు సంబంధాలు తెగిపోతున్నట్లు కనిపిస్తున్నది.
చివరకు ఆమె సొంత సామజిక వర్గమైన జాతావ్ లలో సహితం చంద్రశేఖర్ ఆజాద్ వంటి కొత్త నేతలు వస్తున్నారు. దానితో ఆమె ఎన్నికల యంత్రాంగం చిన్నాభిన్నమైన సూచనలు కనిపిస్తున్నాయి. 2012లో ఆమె అధికారంలోకి రావడానికి కారణమైన బ్రాహ్మణ, యాదవేతర ఒబిసిలలో మద్దతు సన్నగిల్లిపోవడంతో ఆమె రాజకీయంగా బలమైన శక్తిగా సాగలేక పోతున్నారు.
ఒక విధంగా ఉత్తర ప్రదేశ్ లో ఆమె కీలకమైన రాజకీయ శక్తిగా ఎదగడానికి బిజెపి దోహదపడింది. వాజపేయి, మురళీమోహన్ జోషి వంటి నాయకుల మద్దతుతో ఆమె బిజెపితో పొత్తు ఏర్పాటు చేసుకొని మొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 1993లో బిఎస్పి సహాయంతో బిజెపిని ఓడించిన ఎస్పీ అధినేత ములాయం సింగ్ పెరుగుతున్న పలుకుబడిని అరికట్టాలని నిశ్చయించుకున్న బ్రాహ్మణుల మద్దతును బిజెపి సహకారంతో ఆమె పొందగలిగింది.
ఆ సమయంలో ఆమె ఎక్కువకాలం అధికారంలో కొనసాగలేక పోయినప్పటికీ బ్రాహ్మణుల మద్దతును సుస్థిరం చేసుకొని 2012లో పూర్తి మెజారిటీతో అధికారంలోకి రాగలిగారు. బ్రాహ్మణ, దళిత్ అనుబంధాన్ని `ప్రజాస్వామ్యపు అద్భుతం’గా పలువురు భావించారు. అయితే వివిధ కారణాల చేత ఆమె రాజకీయ విశ్వసనీయత ప్రశ్నార్ధకరంగా మారుతూ రావడంతో క్రమంగా తన మద్దతును కోల్పోతూ వచ్చారు.
బీఎస్పీ ఇప్పటి వరకు రెండు దశల ఎన్నికల కోసం 109 మంది అభ్యర్థులను ప్రకటించగా, వారిలో 39 మంది ముస్లింలు ఉన్నారు. ఆ విధంగా ముస్లింలపై తనకు గల పట్టును నిలబెట్టుకునే ప్రయత్నం మాయావతి చేస్తున్నారు. తద్వారా రాష్ట్ర రాజకీయాలలో తన రాజకీయ ఉనికి కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మరోవంక ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సహితం వారి మద్దతుపైననే ఆశలు పెట్టుకోవడం గమనార్హం.