మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సోమవారం ఉదయం తన పనిని ప్రారంభించారు నరేంద్ర మోదీ. ఇందులో భాగంగా పీఎం కిసాన్ నిధి 17వ విడత విడుదలకు సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఈ పథకం కింద.. 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని, సుమారు రూ .20,000 కోట్లు పంపిణీ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దీంతో దేశంలోని 9 కోట్ల 30 వేల మంది రైతుల ఖాతాల్లో.. ఒక్కక్కొరికి రూ.2 వేల చొప్పున డబ్బులు పడనున్నాయి.
“రైతన్న అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం మాది. అందుకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రైతు సంక్షేమానికి సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం చేశాను. రాబోయే కాలంలో రైతులు, వ్యవసాయ రంగం కోసం మరింత కృషి చేయాలనుకుంటున్నాము,’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
2024 లోక్ సభ ఎన్నికల్లో గ్రామీణ భారతం నుంచి బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంల రైతు సంక్షేమం పట్ల ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 72 మంది సభ్యులున్న కేంద్ర మంత్రివర్గానికి నేతృత్వం వహిస్తూ మోదీ ఆదివారం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ కొత్త మంత్రివర్గంలో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు అత్యధిక ప్రాతినిధ్యం లభించగా, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రకు కూడా గణనీయమైన ప్రాతినిధ్యం లభించింది. లోక్‌సభకు అత్యధికంగా 80 మంది సభ్యులను పంపే ఉత్తర్‌ప్రదేశ్‌కు ఒక కేబినెట్‌తో సహా తొమ్మిది మంత్రి పదవులు లభించగా, బీహార్ రాష్ట్రం నుంచి మొత్తం ఎనిమిది మంది మంత్రులయ్యారు.