ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) బుధవారం విడుదల చేసిన లింగ వ్యత్యాస సూచీలో భారత్ ఈ ఏడాది రెండు స్థానాలు దిగజారి 129వ స్థానంలో నిలిచింది. 146 దేశాల జాబితాలో ఐస్లాండ్ అగ్రస్థానం దక్కించుకోగా, సూడాన్ చివరి స్థానంలో నిలిచింది.
ఆదాయం, రాజకీయ ప్రాతినిధ్యం, విద్య తదితర అంశాలపై అధ్యయనం ఆధారంగా రూపొందించిన నివేదికలో ఐస్‌ల్యాండ్ 93.5%, భారత్ 64.1% స్కోర్ సాధించాయి. ప్రపంచం మొత్తంగా 68.5 శాతం స్కోరు సాధించిందని, పూర్తి లింగ సమానత్వం సాధించేందుకు మరో 134 ఏండ్లు లేదా ఐదు తరాలు పడుతుందని డబ్ల్యూఈఎఫ్ నివేదిక అభిప్రాయపడింది.
దక్షిణాసియా దేశాల వరకు చూస్తే లింగ వ్యత్యాస సూచీలో భారత్ కంటే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ ముందు స్థానాల్లో ఉండటం గమనార్హం. ఇక పాకిస్థాన్ చివరి నుంచి రెండవ(145వ) స్థానంలో ఉన్నది. ఆర్థిక లింగ సమానత్వం తక్కువ ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్, సూడాన్, ఇరాన్, పాకిస్థాన్, మొరాకో సహా భారత్ కూడా ఉన్నది.
అయితే ఈ స్కోర్ గత నాలుగేండ్లుగా స్వల్పంగా పెరుగుతున్నదని నివేదిక తెలిపింది. అయితే సెకండరీ విద్యలో భారత్ మెరుగైన లింగ సమానత్వం చూపిందని పేర్కొన్నది. మహిళల రాజకీయ సాధికారత విషయంలో భారత్ ఇంకా వెనుకబడి ఉన్న విషయాన్ని నివేదిక ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
మంత్రి పదవుల్లో కేవలం 6.9 శాతం, పార్లమెంట్లో 17.2 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారని తెలిపింది. మహిళల రాజకీయ సాధికారత విషయంలో భారత్ ప్రపంచంలో 65 ర్యాం కులో ఉన్నదని డబ్ల్యూఈఎఫ్ వెల్లడించింది.