కాంగ్రెస్ పార్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎట్టకేలకు ఎన్నికల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ గెలిచిన కేరళ వయనాడ్ నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. 2019 నుంచి కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా ఉంటున్నప్పటికీ ఆమె ఇంకా ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశింపలేదు.
కొన్నేళ్ల క్రితం జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ అలా జరగలేదు. 2019 ఎన్నికలలో వారణాసి నుండి ప్రధాని నరేంద్ర మోదీపై పోటీచేస్తారని వార్తలు వచ్చినా ఆమె చేయలేదు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె కచ్చితంగా పోటీ చేస్తారని కాంగ్రెస్ శ్రేణులు కూడా భావించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయాలని, తన మనసులో మాట కూడా బయటపెట్టారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. కానీ ప్రియాంక గాంధీ పోటీ చేయలేదు.
ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు సీట్లల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అవి తల్లి సోనియా గాంధీకి చెందిన రాయ్‌బరేలీ, 2019లో తాను గెలిచిన కేరళ వయనాడ్ సీటు. ఈసారి ఆయన ఆ రెండు సీట్లల్లోనూ విజయం సాధించారు. రాజ్యాంగం ప్రకారం ఆ రెండింట్లో ఒకటి ఒదులుకోక తప్పదు. వయనాడ్, రాయ్‌బరేలీల్లో రాహుల్ గాంధీ ఏ సీటు వదులుకుంటారు? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
రాహుల్ గాంధీ.. కేరళ వయనాడ్ సీటును వదులుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు.. ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రంపైనా ఇటీవలే సంకేతాలిచ్చారు రాహుల్ గాంధీ. “నా సోదరి వారణాసి నుంచి పోటీ చేసి ఉంటే.. ప్రధాని నరేంద్ర మోదీని 2,3 లక్షల ఓట్ల తేడాతో ఓడించేది,” అంటూ ధీమా వ్యక్తం చేశారు.
దేశ రాజకీయాల్లో సోదరుడు రాహుల్ గాంధీకి సాయం చేస్తూనే యూపీ కాంగ్రెస్‌ని తన భుజాల మీద మోస్తున్నారు ప్రియాంక. లోక్‌సభ ఎన్నికల్లోనూ అక్కడ కీలకంగా వ్యవహరించారు. ఫలితంగా.. ఈసారి కాంగ్రెస్ ఆరు సీట్లు గెలుచుకోగలిగింది. 2019లో ఇది కేవలం ఒక్కటి మాత్రంగానే ఉంది.