ఈ ఏడాది ఐసీసీ మహిళా క్రికెటర్ అవార్డు స్మృతీ మందానను వరించింది. 2021 సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను ఈ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. 2021 సీజన్లో స్మృతీ ఆడిన మ్యాచ్‌ల వివరాలను ఐసీసీ వెల్లడించింది.
ఈ సీజన్లో ఆమె 22 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి 38.86 సగటుతో 855 రన్స్ చేసిందనీ.. అందులో ఓ సెంచరీ, అయిదు హాఫ్ సెంచరీలున్నాయని ఐసీసీ తెలిపింది. వాస్తవానికి 2021 సీజన్లో ఇండియా పెద్దగా రాణించకపోయినా.. స్మృతీ మందాన మాత్రం తన బ్యాట్‌తో సత్తా చాటడం వల్లే రేచల్ హైవో ఫ్లింటో ట్రోఫీని దక్కించుకున్నదని ఐసీసి వెల్లడించింది.
ఇక స్మృతీ మందాన ఆడిన మ్యాచ్‌ల వివరాలు.. దక్షిణాఫ్రికాతో జరిగిన హోమ్ సిరీస్‌లో ఇండియా కేవలం రెండు మ్యాచ్‌లను మాత్రమే గెలిచింది. ఆ రెండింటిలో మందాన భారీ ఇన్నింగ్స్ ఆడి ఇండియాను విజయ తీరాలకు చేర్చింది. ఓ వన్డే మ్యాచ్‌లో చేజింగ్‌లో 80 రన్స్ చేసింది. ఇక ఓ టీ20లో 48 రన్స్ చేసి ఇండియాకు విక్టరీని అందించింది.
ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 78 రన్స్ చేసింది. వన్డేల్లో, టీ20ల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లోనూ అద్భుత ఫామ్‌ను ప్రదర్శించింది.
రెండవ వన్డేలో 86 రన్స్ చేసింది. ఇక ఒక టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నది. ఆసీస్‌తో జరిగిన ఓ టీ20లో హాఫ్ సెంచరీ చేసింది. పింక్ బాల్ టెస్టులో సెంచరీ చేసి స్మ తీ రికార్డు క్రియేట్ చేసింది.