ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించింది.
కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లేందుకు బెయిల్ ఉత్తర్వులపై 48 గంటల పాటు నిలుపుదల చేయాలన్న ఈడీ అభ్యర్థనను ప్రత్యేక జడ్జి నియయ్ బిందు గురువారం తిరస్కరించారు. రూ.లక్ష వ్యక్తిగత బాండ్ పూచీకత్తుపై కేజ్రీవాల్‌ను విడుదల చేయాలని ఆదేశించారు.
అయితే, ట్రయల్ కోర్టు తీర్పును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేజ్రీవాల్ బెయిల్‌పై హైకోర్టులో సవాల్ చేసింది. ఈడీ తరపు న్యాయవాది ఏఎస్జీ ఎస్వీ రాజు వాదించారు. కేజ్రీవాల్ బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించేందుకు దర్యాప్తు సంస్థకు పూర్తి అవకాశం ఇవ్వలేదని హైకోర్టుకు తెలియజేశారు.
కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించింది. ఈడీ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకూ బెయిల్ మంజూరు చూయకూడదని తేల్చి చెప్పింది.
కాగా, ట్రయల్ కోర్టు జారీ చేసిన బెయిల్ ఆర్డర్ వెబ్సైట్లో అప్లోడ్ కాకుముందే ఈడీ హైకోర్టుకు ఎలా వెళ్లిందని సునీతా కేజ్రీవాల్ ప్రశ్నించారు. ‘అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్‌ను ట్రయల్ కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయకముందే.. ఈడీ హైకోర్టును ఎలా ఆశ్రయిస్తుంది..? సీఎం స్థాయిలో ఉన్న నా భర్తను ప్రభుత్వం, కేంద్ర సంస్థలు వాంటెడ్ టెర్రరిస్టులా చూస్తున్నాయి. దేశంలో నియంతృత్వం పెరిగిపోయింది. హైకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.
