ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కలిసి రావిరాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం (ఆర్సీఐ) ఉపయోగించుకుంటున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంతో పాటు నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ శాఖ భూములు తమకు అవసరమని, ఆర్సీఐ రాష్ట్ర ప్రభుత్వ భూములు వినియోగించుకుంటున్నందున రక్షణ శాఖ భూములు 2,450 ఎకరాలు తమకు అప్పగించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం, రక్షణ శాఖ భూముల పరస్పర బదిలీకి అంగీకరించాలని రక్షణ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఙప్తి చేశారు. వరంగల్ నగరానికి గతంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసినా గత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణపరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతుల గడువు ముగిసినందున అనుమతులు పునరుద్ధరించాలని లేదా తాజాగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.
2.70 లక్షల ఇళ్లను మంజూరు చేయండి
కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఎల్సీ మోడల్లో తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రి ఖట్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆయన నివాసంలో కలిశారు.
రాష్ట్రంలో తాము నిర్మించదల్చిన 25 లక్షల ఇళ్లలో 15 లక్షలు ఇళ్లు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయని, వాటిని లబ్ధిదారు ఆధ్వర్యంలోని వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం (బీఎల్సీ) పద్థతిలో నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు.
ప్రధానమంత్రి ఆవాస యోజనను (పట్టణ)-పీఎంఏవై (యూ) కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకున్నందున, 2024-25 సంవత్సరానికి పీఎంఏవై (యూ) కింద మంజూరు చేసే ఇంటి నిర్మాణ వ్యయం నిధులు పెంచాలని, రాష్ట్రంలో తాము నిర్మించే ఇళ్లను పీఎంఏవై (యు) మార్గదర్శకాల ప్రకారం నిర్మిస్తామని కేంద్ర మంత్రి ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.
పీఎంఏవై (యూ) కింద ఇప్పటి వరకు తెలంగాణకు 1,59,372 ఇళ్లు మంజూరు చేసి రూ.2,390.58 కోట్లు గ్రాంటు కింద ప్రకటించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అయితే ఇందులో ఇప్పటి వరకు కేవలం రూ.1,605.70 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగతా నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.