లోక్‌సభ స్పీకర్‌గా మళ్లీ ఓం బిర్లాకే అవకాశం కల్పించాలని ఎన్డీయే కూటమి నిర్ణయించింది. అయితే, ఈ విషయంలో అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ తరఫున ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేయనుండగా.. విపక్ష ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ నామినేషన్ దాఖలు చేశారు.
మొత్తం 543 మంది సభ్యులున్న లోక్‌సభలో ఎన్డీఏకు 293, ప్రతిపక్ష ఇండియా కూటమికి 234 మంది ఎంపీలు ఉన్నారు. కొంతమంది స్వతంత్ర ఎంపీలు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. కానీ ఎన్డీయే కూటమికి సభలో స్పష్టమైన మెజారిటీ ఉంది. అయితే, ఓం బిర్లాను స్పీకర్‌గా కొనసాగిస్తే.. డిప్యూటీ స్పీకర్ పదవిని తమకు ఇవ్వాలని విపక్షాలు చేసిన ప్రతిపాదనను ఎన్డీయే కూటమి తిరస్కరించింది.
దీంతో స్పీకర్ పదవికి అభ్యర్ధిని నిలపాలని ఇండియా కూటమి నిర్ణయించింది. డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని రాహుల్ గాంధీ కూడా కోరారు. అందుకు అధికార పక్షం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇప్పటి వరకూ దేశ పార్లమెంట్ చరిత్రలోనే స్పీకర్ ఎన్నిక జరిగిన దాఖలాలు లేవు. ఏకగ్రీవంగానే స్పీకర్‌ను ఎన్నుకునేవారు స్పీకర్ పదవి అధికార పార్టీకి.. డిప్యూటీ స్పీకర్ విపక్షానికి దక్కేది.
కానీ, ఈసారి మాత్రం ఎన్నిక అనివార్యమైంది. స్పీకర్ పదవికి జూన్ 26న ఎన్నికలు జరగనున్నాయి. తాము ఓం బిర్లాకు మద్దతు ఇస్తాం కానీ.. డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని ఇండియా కూటమి ప్రతిపాదన చేసింది. నామినేషన్‌కు గడువు ముగిసే సమయం దగ్గర పడుతున్నా అధికార పక్షం ఎటువంటి హామీ రాకపోవడంతో ఇండియా కూటమి స్పీకర్ పదవికి పోటీచేయాలని నిర్ణయించింది.
సరిగ్గా గడువుకు 10 నిమిషాల ముందే సీనియర్ ఎంపీ కేఆర్ సురేశ్ నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని బీజేపీ సూచించిందని, ముందు ఓం బిర్లాకు మద్దతు ఇవ్వాలని విపక్షాలకు పిలుపునిచ్చిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వం, దేశాన్ని నడపడానికి ఏకాభిప్రాయం అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కిచెప్పిన 24 గంటలైనా కాకముందే బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు, ప్రతిపక్షాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. దీనిపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. డిప్యూటీ సభాపతి పదవిని విపక్షానికి ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోందని, ఈసారి కూడా ఇదే ప్రతిపాదన చేశామని చెప్పారు. కానీ, బీజేపీ మాత్రం మా ప్రతిపాదనకు అంగీకరించలేదని పేర్కొన్నారు.
సోమవారం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో ఖర్గేతో చర్చిస్తామని చెప్పారని, కానీ ఇంత వరకూ ఎటువంటి సమాచారం లేదన్నారు. అధికారపక్షం తీరు ఇండియా కూటమిని అవమానించేలా ఉందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.