పేద ప్రజలకు తాము అధికారంలోకి వస్తే ఉచిత పథకాలతో లబ్ధిచేకూరుస్తామని రాజకీయ పార్టీలు, నేతలు, ఎన్నికల వేళ చేస్తున్న వాగ్దానాల పట్ల సుప్రీం కోర్టు కన్నెర్ర చేసింది. ఉచిత వాగ్దానాలు సాధారణ బడ్జెట్‌ను మించి ఉంటున్నాయని, ఇలాంటి జనాకర్షక హామీలు గుప్పించడం తీవ్రమైన అంశమని పేర్కొంది.
ఇక నుంచైనా ఉచిత వాగ్దానాల వర్షం కురిపించే రాజకీయ పక్షాలను, నేతలను నియంత్రించాల్సిన అవసరం ఉందని తెలిపింది. దీనిపై తమ వైఖరి తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
ఎన్నికలకు ముందు ప్రజానిధులతో ఉచిత తాయిలాలు పంచిపెడుతూ, ఉచిత హామీలిస్తున్న పార్టీల ఎన్నికల గుర్తును స్తంభింపజేయాలని, రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని న్యాయవాది అశ్విన్ ఉపాధ్యారు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత వాగ్దానాలతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నాయంటూ పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ హిమాకోహ్లితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఈ చట్ట విరుద్ధమైన వ్యవహారాన్ని ఎలా అదుపు చేయాలో, చట్టబద్ధంగా ఎలా నియంత్రించాలో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.
ఈ ఎన్నికల్లోపే ఇది చేయగలమా? వచ్చే ఎన్నికలకు చేయగలమా? ఈ పరిస్థితిని నిరోధించేందుకు సాధ్యమవుతుందా..? ఉచిత హామీల బడ్జెట్ సాధారణ బడ్జెట్‌ను మించిపోతోంది’ అని జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యానించారు. ఓటర్ల నుంచి రాజకీయ లబ్ధి పొందటం కోసం అనుసరిస్తున్న జనాకర్షణ విధానాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై నిషేధం విధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఇది చాలా తీవ్రమైన సమస్య అంటూ… మార్గదర్శకాలను రూపొందించాలని గతంలో ఎన్నికల సంఘానికి సూచించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అయినప్పటికీ రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరుతూ ఎన్నికల సంఘం కేవలం ఒక సమావేశాన్ని మాత్రమే నిర్వహించిందన్నారు.