భూ కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయి జైల్లో ఉన్న ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఊరట లభించింది. ఈ కేసులో ఝార్ఖండ్ హైకోర్టు శుక్రవారం ఆయనకు బెయిలు మంజూరు చేయడంతో జైలు నుండి విడుదలయ్యారు.
భూ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఝార్ఖండ్ సీఎం, ఝార్ఖండ్ ముక్తి మోర్చా కార్యనిర్వాహక అధ్యక్షుడైన సోరెన్‌ను ఈ ఏడాది జనవరి 31న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన బిర్సా ముండా జైల్లో ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం సోరెన్ పలు న్యాయస్థానాలను ఆశ్రయించారు.
ఎన్నికల వేళ ప్రచార నిమిత్తం బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరినప్పటికీ ఉపశమనం లభించలేదు. బెయిలు పిటిషన్‌పై విచారణ జరిపిన ఝార్ఖండ్ హైకోర్టు ఈ నెల 13న తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం బెయిలు మంజూరు చేస్తూ జస్టిస్ రొంగొన్ ముఖోపాధ్యాయ తీర్పు ఇచ్చారు. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించారు.
‘‘ప్రాథమిక ఆధారాల పరంగా ఆయన ఏ నేరానికీ పాల్పడలేదు. బెయిల్‌పై ఉన్నప్పుడు నేరం చేసే అవకాశాలు కూడా లేవని కోర్టు గుర్తించింది. అందుకే ఆయనకు బెయిల్ ఇస్తున్నాం’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ తీర్పు అమలుపై 48 గంటల పాటు స్టే ఇవ్వాలని, తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న ఈడీ తరఫు న్యాయవాది అభ్యర్థననను న్యాయమూర్తి తిరస్కరించారు.
దీంతో, బిర్సా ముండా జైలు నుంచి హేమంత్ సోరెన్ విడుదలయ్యారు. సోరెన్‌కు బెయిలు లభించడంపై హర్షం వ్యక్తం చేసిన ఝార్ఖండ్ సీఎం చంపయి సోరెన్ ‘నిజం గెలిచింది’ అని చెప్పారు. మనీలాండరింగ్ కేసులో తనను తప్పుగా ఇరికించి ఐదు నెలలు జైలులో ఉంచారని జైలు నుండి విడుదల అనంతరం హేమంత్ సోరెన్ ఆరోపించారు. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్తుల గొంతును ప్రభుత్వం అణచివేస్తున్న తీరు చూసి తాను ఆందోళన చెందుతున్నానని ఆయన చెప్పారు.