జనాభా లెక్కల ప్రక్రియ ముగిసేవరకు గ్రామాలు, పట్టణాల భౌగోళిక సరిహద్దులు మార్చకూడదంటూ కేంద్రం జారీచేసిన ఆంక్షలను ఖాతరు చేయకుండా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మంగళవారం అర్ధాంతరంగా రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తూ ఉత్తరువులు జారీచేసింది.
13 జిల్లాలను పార్లమెంట్ నియోజకవర్గం ప్రాతిపదికన 26 జిల్లాలుగా మారుస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గత రాత్రి ఉత్తరువులు జారీచేసింది. మంగళవారం ఉదయమే ఈ ప్రతిపాదనను తిరిగి తెరపైకి తీసుకు వచ్చి, ఆన్ లైన్ లోనే మంత్రివర్గం ఆమోదం పొంది, రాత్రికల్లా ఉత్తరువులు జారీచేసింది.
ఆన్లైన్లోనే కొత్త జిల్లాల వివరాలను మంత్రులకు పంపారు. వాటిని పరిశీలించిన మంత్రులు అంగీకారం తెలిపారు. 1974 జిల్లాల ఏర్పాటు చట్టంలో సెక్షన్ 3(5) ప్రకారం (ఫార్మేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ యాక్ట్) కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.
రాష్ట్రంలో 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నప్పటికీ భౌగోళిక పరిస్థితుల రీత్యా అరకు పార్లమెంటు నియోజకవర్గాన్ని రెండుగా మార్చారు. ఈ మేరకు రూపొందించిన నివేదికను మంగళవారమే ప్రణాళికాశాఖ కార్యదర్శి జి.ఎస్.ఆర్.కె.ఆర్.విజయకుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మకు ఆందించారు.
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై ప్రజలు, ప్రజాసంఘాల నుంచి ఫిబ్రవరి 26 వరకు అభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఆ తర్వాత ప్రజాభిప్రాయం మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ కానుంది. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి అంటే ఏప్రిల్ 2వతేదీ నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదే అంశంపై సమీర్‌శర్మ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీ మ్యాపులను ప్రణాళికశాఖ సిద్ధం చేసింది. వాటి ప్రకారం మండలాలు, జనాభా వివరాలనూ రూపొందించింది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రాల సరిహద్దులనే జిల్లా కేంద్రాల సరిహద్దులుగా నిర్ణయించారు.
సరిహద్దుల పేరుతో గ్రామాలను మండలాల నుండి విడగొట్టకూడదని నిర్ణయించారు. నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో అభ్యంతరాలతోపాటు మొత్తం ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అధికారంలోకి రాగానే 1920 జనవరి 26 నాటికే కొత్త జిల్లాల ఏర్పాటుకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ దేశంలో జనన గణసేకరణ పూర్తి కాకుండా ఈ పక్రియ చేపట్టవద్దని కేంద్రం నుండి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వెనుకడుగు వేసింది.
దేశవ్యాప్తంగా జనాభా గణనకు కేంద్రం 2020 జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. జనాభా లెక్కల ప్రక్రియ ముగిసేవరకు గ్రామాలు, పట్టణాల భౌగోళిక సరిహద్దులు మార్చకూడదంటూ ఫ్రీజింగ్(నిషేధ) ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ కూడా మోమో జారీ చేసింది. దీంతోనే జిల్లాల ఏర్పాటు ప్రక్రి య అధికారికంగా నిలిచిపోయింది.
ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల సమయంలోనూ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై హడావుడి చేసినప్పుడు.. నాటి ఎన్నికల అధికారి రమేశ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సెన్సస్ డైరెక్టర్ ఇచ్చిన ఫ్రీజింగ్ ఉత్తర్వులు ఉండగా, ఎన్నికల సమయంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయడానికి వీల్లేదని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖరాశారు. దీంతో ఆ ప్రక్రియను ఆపేశారు.
ఫ్రీజింగ్ ఉత్తర్వులను ఇప్పటికీ కేంద్రం వెనక్కి తీసుకోలేదు. కరోనా కారణంగా జన గణన పూర్తిస్థాయిలో జరగడం లేదు. అయినప్పటికీ, కేంద్రం అభ్యంతరాలను ఖాతరు చేయకుండా, జనవరి 26 నాటికే ఈ ఉత్తరువు జారీ చేయడం గమనార్హం. ఇప్పుడు అధికారికంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టడానికి వీల్లేదని రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి.
అయితే, ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు అవసరమైన కసరత్తును అనధికారికంగా చేపట్టవచ్చు. అందుకు సంబంధించిన అధ్యయనం చేయవచ్చు. అధికారికమైన ఉత్తర్వులు జారీ చేయడానికి మాత్రం వీల్లేదు. కొత్తా జిల్లాలపై ముందస్తు కసరత్తు ప్రక్రియ మన రాష్ట్రంలో ఎప్పుడో మొదలైంది. దీనికి అవసరమైన అధ్యయనం, కసరత్తును రెవెన్యూశాఖ పూర్తి చేసింది. ఇప్పుడు అర్ధాంతరంగా ఈ ఉత్తరువులు జారీ చేయడం అధికార వర్గాలకే విస్మయం కలిగిస్తున్నది.
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అరకు(రంపచోడవరం, పాతపట్నం) అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట, హిందూపురం, కడప, నంధ్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాలుగా ఏర్పాటు కానున్నాయి.
కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 51 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె రెవెన్యూ డివిజన్ అతి పెద్దది. 33 మండలాలు ఇందులో ఉంటాయి. పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా పది నుంచి 12 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది.