అరకు కాఫీ అద్భుతమని ప్రధాని మోదీ ప్రశంసించారు. సీఎం చంద్రబాబుతో కలిసి ఈ కాఫీ రుచి చూశానన్నారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో అరకు కాఫీ గురించి ప్రస్తావించారు. గొప్ప రుచికి, సువాసనకు ఇది ప్రసిద్థి చెందిందన్నారు. ‘దేశంలోని స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్ ప్రాశస్త్యం రావడం గర్వకారణం. అటువంటిదే అరకు కాఫీ.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇది ఉత్పత్తి అవుతోంది. దాదాపు 1.5 లక్షల గిరిజన కుటుంబాలు దీని సాగుతో ముడిపడి ఉన్నాయి. అరకు కాఫీని కొత్త పుంతలు తొక్కించడంలో గిరిజన సహకార సంఘానిది కీలక పాత్ర. దీంతో రైతుల ఆదాయం బాగా పెరిగింది. ఒకసారి విశాఖలో ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి ఈ కాఫీని రుచి చూేస అవకాశం నాకు లభించింది.
చాలా అద్భుతంగా ఉంది. అరకు కాఫీకి అనేక అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. ఢిల్లీలో జరిగిన జీ-20 సదస్సులోనూ దీని మాధుర్యాన్ని అతిథులు రుచి చూశారు. మీకూ అవకాశం దొరికినప్పుడల్లా అరకు కాఫీని ఆస్వాదించండి’ అని మోదీ ప్రజలను కోరారు. తర్వాత సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చంద్రబాబుతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేశారు.
మోదీ పోస్టుపై చంద్రబాబు కూడా స్పందించారు. ‘అరకు కాఫీని మన గిరిజన సోదరీమణులు ప్రేమ, భక్తితో పండిస్తారు. ఇది సుస్థిరత, గిరిజన సాధికారత, ఆవిష్కరణలకు ప్రతీకగా నిలుస్తుంది. ఇది ఏపీ ప్రజల అపరిమితమైన సామర్థ్యానికి ప్రతిబింబం. అరకు కాఫీకి సంబంధించిన విషయాన్ని షేర్ చేసినందుకు, మేడిన్ ఏపీ ఉత్పత్తిగా ఉన్న సదరు కాఫీకి ప్రచారం కల్పిస్తున్నందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు. మీతో మరో కప్పు అరకు కాఫీ తాగుతూ ఆనందించడానికి ఎదురు చూస్తున్నాను’ అని పేర్కొన్నారు.