ఈనెల 22వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు శనివారం ప్రకటించారు. ఆగస్టు 12 వరకూ ఈ సమావేశాలు జరగనున్నట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ను జులై 23న లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్ నెలకొల్పనున్నారు. వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రిగా ఎన్నికైన ఆమె.. 2024-25 బడ్జెట్ను సమర్పించనున్నారు. అయితే, వరుసగా ఆరుసార్లు బడ్జెట్లను సమర్పించిన మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ని అధిగమించనున్నారు. మొరార్జీ దేశాయ్ వరుసగా ఆరుసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడితే.. వరుసగా ఏడు కేంద్ర బడ్జెట్లను సమర్పించిన ఆర్థిక మంత్రిగా ఆమె సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయనున్నారు.
లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తాత్కాలికంగా మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సంప్రదాయం ప్రకారం లోక్ సభ ఎన్నికలు జరిగే సంవత్సరం ముందుగా మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెడ్తారు. అందులో కీలకమైన పాలసీ ప్రతిపాదనలు, ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు ఉండవు. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తరువాత, గెలిచిన ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడ్తుంది. అందులో కీలక ప్రతిపాదనలు, నిర్ణయాలు ఉంటాయి.