ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సతీమణి విజయమ్మ, ఇతర ముఖ్య నాయకులు నివాళులు అర్పించారు. జగన్‌తో పాటు తల్లి విజయమ్మ, మేనత్త విమలమ్మ, సతీమణి భారతి, రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
మూడ్రోజులుగా కడప పర్యటనలో భాగంగా జగన్ సామాన్య ప్రజల్ని నేరుగా కలుస్తున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో సొంత ప్రజల్ని కూడా దగ్గరకు రానివ్వలేదని అపవాదును చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అభిమానులు, పార్టీశ్రేణుల్ని ఎలాంటి అటంకాలు లేకుండా కలుస్తున్నారు. ఇడుపులపాయ ఘాట్ వద్దకు వచ్చిన స్థానికులు, అభిమానుల్ని జగన్ అప్యాయంగా పలకరించారు.
మరోవంక, ఇడుపులపాయలో వైఎస్సార్‌కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా నివాళులు అర్పించారు. షర్మిల సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్‌కు నివాళులు అర్పిస్తారని ప్రచారం జరిగినా జగన్ నివాళులు అర్పించే సమయంలో ఆమె ఘాట్ వద్దకు రాలేదు.
జగన్ వెళ్ళిపోయిన తర్వాత భర్త అనిల్, కుమారుడు, కోడలు, కుమార్తెలతో కలిసి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. షర్మిల నివాళులు అర్పించే సమయంలో కూడా తల్లి విజయమ్మ వారితో పాటు ఉన్నారు.
కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం విజయవాడలో ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి కార్యక్రమానికి రేవంత్ హాజరుకానున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగే కార్యక్రమానికి రేవంత్ హాజరవుతారు. రేవంత్‌తో పాటు కర్ణాటక ఉపముఖ్యమంత్రి శివకుమార్ కూడా వస్తున్నట్టు తెలుస్తోంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ 11స్థానాలకు పరిమితం కావడంతో కాంగ్రెస్ రాజకీయంగా బలోపేతం కావాలని భావిస్తోంది. దీంట్లో భాగంగానే వైఎస్సార్ జయంతిని షర్మిల భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో కూడా నేడు వైఎస్సాఆర్ జయంతి వేడుకలను టీపీసీసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజాభవన్, గాంధీభవన్లలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజాభవన్‌లో వైఎస్సాఆర్ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు.
సోమవారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనేతలు పంజగుట్టలోని వైఎస్సాఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం నేతలంతా ప్రజాభవన్‌కు వెళ్లి.. అక్కడ వైఎస్సార్ ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు.
ఆ తర్వాత గాంధీభవన్ లో వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తారు. గాంధీభవన్‌లో రక్తదాన శిబిరాన్నీ సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్తారు. మంగళగిరిలో జరిగే జయంతి వేడుకల్లో పాల్గొంటారు. సీఎం రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ మంత్రులు, ముఖ్యనేతలు కూడా విజయవాడ వస్తారు.