2019-2024 మధ్యకాలంలో విద్యుత్ రంగంలో జరిగిన నష్టం అంతా ఇంతా కాదని చెబుతూ ప్రజలపై మొత్తంగా రూ 32,166 కోట్ల అదనపు భారం పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేస్తూ ఈ రంగంలో మొత్తం రూ.47,741 కోట్లు నష్టపోయామని తెలిపారు.
అసమర్థ నిర్ణయాల కారణంగా ప్రజలపై భారం పడిందని, సోలార్ విద్యుత్ వాడుకోకుండా రూ.9 వేల కోట్లు చెల్లించారని వెల్లడించారు. గృహ వినియోగదారులపై రూ.8,180 కోట్ల భారం పడిందని చెప్పారు.
‘‘పెత్తందారులు, పేదవారికి పోటీ అని చెప్పేవాడు. ఈ పెత్తందారీ పాలనలో పేదవాడు ఎలా నలిగిపోయాడో అందరికీ తెలిసింది. చేతకాని పరిపాలన కారణంగా మొత్తం విద్యుత్ సంస్థలు దెబ్బతిన్నాయి. అసమర్థుడు కారణంగా మొత్తం రూ.47,741 కోట్లు నష్టపోయాం. పోలవరం పవర్ ప్రాజెక్టు జాప్యం కారణంగా రూ.4,700 కోట్లు నష్టం వచ్చింది” అని తెలిపారు.
దేశంలోనే మొదటగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో విద్యుత్ సంస్కరణలను ప్రవేశపెట్టిన కారణంగా 2004లో తాను అధికారం కోల్పోయినా దేశం బాగుపడిందని చంద్రబాబు తెలిపారు. తాను తెచ్చిన సంస్కరణలు వైఎస్ హయాంలో కనిపించాయని చెబుతూ తన హయాంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామని, విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు.
“2014-19లో సౌరశక్తి, పవన విద్యుత్ ఉత్పత్తి పెంచాం. 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఎదిగింది. 2018-19 నాటికి 14,929 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరేలా కృషి చేశాం. మా హయాంలో ట్రాన్స్‌కో, జెన్కోకు అవార్డులు వచ్చాయి” అని ముఖ్యమంత్రి వివరించారు.
ట్రూఅప్, ఇంధన సర్‌ఛార్జి, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని రకరకాలుగా గత ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసిందని, గృహ వినియోదారులపై 45శాతం ఛార్జీలు పెంచారని చంద్రబాబు చెప్పారు. ఛార్జీల పెంపుతో కోటీ 53 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని, 50 యూనిట్లు వాడిన పేదలపై వందశాతం ఛార్జీలు పెంచారని పేర్కొన్నారు.
టారిఫ్ ద్వారా రూ.16,699 కోట్లు, ట్రూ అప్ ద్వారా రూ.5,886 కోట్లు, ఇంధన ఛార్జీలు రూ.3,977 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో రూ.5,607 కోట్ల మేర వసూలు చేశారని వివరించారు. రూ.వేల కోట్ల రుణం తీసుకుని విద్యుత్ రంగంపై పెనుభారం వేశారని పేర్కొంటూ ఐదేళ్లలో విద్యుత్ సంస్థల అప్పు 79శాతం మేర పెరిగిందని చెప్పారు.
కొన్ని సార్లు ఉత్పత్తి నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజలపై భారం మోపాయని చెబుతూ కోర్టు ఆదేశంతో నిర్వహణ ఛార్జీలు రూ.9వేల కోట్లు చెల్లించారని గుర్తు చేశారు. పవన విద్యుత్‌లో చేసుకున్న 21 ఒప్పందాలు రద్దు చేశారని ధ్వజమెత్తారు. అసమర్థ పాలనతో విద్యుత్ రంగం 47,741 కోట్లు నష్ట పోయిందని, విద్యుత్ రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి దాదాపు రూ.1,29,503 కోట్ల నష్టం జరిగింది” అని చంద్రబాబు వివరించారు.