భారత్లో గతేడాది డిసెంబర్ నాటికి 5.3 కోట్ల మంది నిరుద్యోగులున్నారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సిఎంఐఇ) తెలిపింది. వీరిలో మహిళలు ఎక్కువగా ఉన్నట్టు వివరించింది.
కాగా, మొత్తం నిరుద్యోగుల్లో 3.5 కోట్ల మంది క్రియాశీలంగా ఉపాధిని కోరుకుంటున్నవారు కాగా, 1.7 కోట్ల మంది పని చేయాలనే తపన ఉన్నప్పటికీ ఉద్యోగాన్ని చురుకుగా కోరుకోనివారని సీఎంఐఈ వివరించింది.
కాగా, ఉద్యోగం చేయాలనే తపన ఉన్నప్పటికీ నిరుద్యోగులుగా మిగిలిపోయిన 3.5 కోట్ల మందికి తక్షణమే ఉపాధి చూపెట్టాల్సిన అవసరం భారత్కు ఉన్నదని సీఎంఐఈ విశ్లేషించింది. ఈ 3.5 కోట్ల మంది నిరుద్యోగుల్లో 23 శాతం మంది అంటే 80 లక్షల మంది మహిళలు ఉన్నారు.
ఇక, 1.7 కోట్ల మంది నిరుద్యోగుల్లో 53 శాతం మంది, అంటే 90 లక్షల మంది వరకు మహిళలున్నారు. ‘ఇంత సంఖ్యలో మహిళలు నిరుద్యోగులుగా ఉండటానికి ఉద్యోగాలు లేకపోవడమా? లేదా శ్రామిక శక్తిలో భాగమయ్యేందుకు సామాజిక మద్దతు లేకపోవడమా’ అని సీఎంఐ ఈ ప్రశ్నించింది.
మహమ్మారి విజృంభించిన 2020 ఏడాదిలో ప్రపంచ ఉపాధి రేటు 55 శాతంగా ఉందనీ, ఇది భారత్లో కనిష్టంగా 43 శాతంగా ఉందన్న ప్రపంచబ్యాంకు సమాచారాన్ని సీఎంఐఈ ఈ సందర్భంగా ఉటంకించింది.
అయితే, సీఎంఐఈ మాత్రం భారత ఉద్యోగ రేటును 38 శాతంగా తెలిపింది. ప్రపంచ ఉపాధి రేటు ప్రమాణాలను చేరుకోవడానికి భారత్ అదనంగా 18.75 కోట్ల మందికి ఉద్యోగాలను చూపెట్టాల్సినవసరం ఉన్నదని వివరించింది. ఇది అతిపెద్ద సవాలేనని తెలిపింది.